కర్నూలులో సైకో వీరంగం

10 Nov, 2017 01:39 IST|Sakshi

మద్యానికి డబ్బులివ్వలేదని కొడవలితో ఇద్దరిపై దాడి 

ఆపై గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం..

కర్నూలు (హాస్పిటల్‌): తల్లి మరణంతో విషాదంలో ఉన్న ఆ కుటుంబ సభ్యులను మద్యానికి డబ్బులు అడిగాడు. వారు ఇవ్వకపోవడంతో విచక్షణ కోల్పోయిన ఓ సైకో వీరంగం సృష్టించాడు. ఇద్దరిపై కొడవలితో దాడి చేసి గాయపరిచాడు. ఆ తర్వాత గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కర్నూలులో గురువారం ఈ ఘటన జరిగింది. దళితపేటకు చెందిన రవికొండలరావు, అతడి బావమరిది సెంట్రింగ్‌ బాబూరావు కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. రవికొండలరావు తల్లి లింగాయమ్మ అనారోగ్యంతో గురువారం ఉదయం చనిపోయారు. ఆమె అంత్యక్రియలకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో ఎదురింటిలో నివసించే యుగంధర్‌బాబు అనే వ్యక్తి వచ్చి మద్యం తాగేందుకు డబ్బులివ్వాలని రవికొండలరావును అడిగాడు.

బాధలో తాముంటే మధ్యలో నీ గొడవేందంటూ పంపించేశారు. దీంతో యుగంధర్‌బాబు అసహనంతో ఇంట్లోకి వెళ్లి వేటకొడవలి తీసుకొచ్చి ఒక్కసారిగా రవికొండలరావుపై దాడి చేశాడు. దీంతో అక్కడున్నవారు నిర్ఘాంతపోయి పరుగులు తీశారు. అడ్డుకోబోయిన బాబూరావుపై కూడా సైకో దాడి చేశాడు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి కత్తితో గొంతుకోసుకున్నాడు. వెంటనే స్థానికులు వీరిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రవికొండలరావు, బాబూరావులకు చెవి, చెంపలపై గాయాలు కాగా, యుగంధర్‌బాబు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.

>
మరిన్ని వార్తలు