ప్రభుత్వ తీరుపై ప్రజాగ్రహం!

23 Dec, 2014 01:24 IST|Sakshi

అసెంబ్లీలో రైతుల పక్షాన వైఎస్ జగన్
పోరాటాన్ని స్వాగతిస్తున్న రైతులు, రైతు సంఘాలు
ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు ప్రభుత్వ యత్నాలపై ఆగ్రహం
సమగ్ర చర్చ జరగాలని డిమాండ్

 
విజయవాడ : రైతు రుణమాఫీ, సీఆర్‌డీఏ బిల్లుపై సోమవారం రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో జరిగిన చర్చ జిల్లా వాసుల్లో ఆసక్తి రేపింది. ఉదయం రైతు రుణమాఫీ, సాయంత్రం సీఆర్‌డీఏ బిల్లుపై జరిగిన చర్చలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల పక్షాన నిలిచి ప్రభుత్వాన్ని నిలదీయడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. ఎన్నికల సమయంలో రైతులు, డ్వాక్రా మహిళల రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చిన తరువాత నిబంధనల పేరుతో కోతలు పెట్టారంటూ జగన్‌మోహన్ రెడ్డి శాసనసభలో ప్రశ్నించగా, దానికి సరైన సమాధానం ఇవ్వాల్సిన ప్రభుత్వం సహనం కోల్పోయి వ్యవహరించడం సరికాదని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. రైతులకు రుణమాఫీ సరిగా జరగలేదని, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్, గరిష్ట రుణ పరిమితి పేరిట రైతులను మోసం చేస్తున్నారని కృష్ణాజిల్లాలో రైతులకు జరిగిన అన్యాయాన్ని కేస్ స్టడీలు సహా వివరించడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఆర్‌డీఏ బిల్లులో రైతులకు ఇచ్చే వాటా గురించి స్పష్టంగా లేకపోవడం వల్ల అన్నదాతలు నష్టపోతారంటూ ప్రతిపక్ష నేత, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నించడాన్ని వారు స్వాగతిస్తున్నారు.

ఇప్పటికే రైతులు, రైతు సంఘాల నేతలు జరీబు భూముల్ని తీసుకోవద్దంటూ మొత్తుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనేది తెలిసిందే. ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అధికారపక్షం.. సహనం కోల్పోయి ఇష్టానుసారం మాట్లాడటం మంచిది కాదని పలువురు రాజకీయ మేధావులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిపక్షం ఎండగడుతుంటే జీర్ణించుకోలేని స్థితిలో టీడీపీ ఎమ్మెల్యేలు, సీఎం ఉన్నారని స్పష్టమవుతోందని వివరిస్తున్నారు.
 
ప్రభుత్వ చేతకానితనం  బయటపడుతోంది

 శాసనసభలో రుణమాఫీ, సీఆర్‌డీఏ బిల్లులపై చర్చను చూస్తే ప్రభుత్వ చేతకానితనం బయటపడుతోంది. ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రతిపక్ష నేత జగన్ ఎండగట్టడం బాగుంది. కీలకమైన ఈ అంశాలపై చర్చ జరగకుండా, ప్రతిపక్షాలకు మైక్‌లు ఇవ్వకపోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. సీఆర్‌డీఏ బిల్లులో రైతులకు ఇచ్చే వాటాను పొందు పరచాలంటూ జగన్ చేసిన డిమాండ్ సహేతుకమైనది.       
 కొలనుకొండ శివాజీ
     
 సమాధానం చెప్పలేని స్థితిలో ప్రభుత్వం

 రుణమాఫీ అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని జగన్ ప్రశ్నిస్తున్న తీరు చాలా బాగుంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిన మాటలు, అధికారంలోకి వచ్చిన తరువాత చెబుతున్న మాటలు, రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని లక్షల కోట్ల రుణాలు ఉన్నదీ తదితర విషయాలను సభలో జగన్ ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. వాస్తవాలను అంకెలు సహా చెప్పడంతో ప్రభుత్వం సమాధానం చెప్పలేని స్థితిలో పడింది.                     - ఎం.మధు
   రైతుసంఘం జిల్లా జాయింట్ సెక్రటరీ
 
 నాడు తండ్రి.. నేడు కొడుకు..

 రైతులను నట్టేట ముంచిన టీడీపీ ప్రభుత్వం గురించి అసెంబ్లీలో జగన్ రైతుల పక్షాన మాట్లాడటం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఆనాడు రైతులకు ఇచ్చిన రుణమాఫీని వైఎస్సార్ పూర్తిగా అమలు చేయించారు. ఇప్పుడు రుణమాఫీ పూర్తిగా అమలు చేయాలని జగన్ పోరాడుతున్నారు. ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ప్రభుత్వం వ్యక్తిగత విమర్శలకు దిగడం  బాధాకరం. అధికారంలో ఉన్నామని మా ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే ప్రజలు ఊరుకోరు.     
 - షేక్ షాబుద్దీన్, చెవిటికల్లు
 
 స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ చెప్పడంలోనూ అబద్ధాలేనా!

 బ్యాంకులు ఇచ్చే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ విషయంలోనూ చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఎకరానికి పంటకు రూ.24 వేలు ఇస్తుంటే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ రూ.19 వేలని చెబుతున్నారు. రుణమాఫీ హామీకి కట్టుబడి ఉండకపోగా ఇంకా రైతులను మోసం చేయాలని చూడటం దారుణం. స్టేట్ లెవల్ బ్యాంకర్ల కమిటీ ఎకరానికి రూ.24 వేలు పంటరుణంగా ఇవ్వాలని నిర్ణయించిన విషయం చంద్రబాబుకు తెలియదా? రుణమాఫీ ప్రకటనతో ఏడాదిగా రైతులు బకాయిలు చెల్లించడం లేదు. దీంతో వడ్డీ 14 శాతం చొప్పున చెల్లించాల్సి వస్తోంది. ఎకరానికి రూ.24 వేల రుణం తీసుకుంటే.. రూ.3,360 వడ్డీ అవుతుంది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం చంద్రబాబు మొదటి విడతగా రూ.3,800 విడుదల చేశారు. దీని ప్రకారం వడ్డీ పోను అసలు చెల్లించేది రూ.440 మాత్రమే. ఏటా ఇలా చెల్లిస్తే.. ఐదేళ్లకు వడ్డీ పోను చెల్లించేది రూ.2,200 మాత్రమే. మిగలినది తీరేదెప్పుడు?  ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి.  
         - ఎంవీఎస్ నాగిరెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్
 

మరిన్ని వార్తలు