ప్రజాసేవకే వచ్చా.. అభివృద్ధి చేస్తా

13 Sep, 2014 02:11 IST|Sakshi
ప్రజాసేవకే వచ్చా.. అభివృద్ధి చేస్తా

పుల్లూరు(పెళ్లకూరు): ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి ప్రజాసేవ చేసేందుకు రాజకీయంలోకి వచ్చిన తనను అందరూ సహృదయంతో దీవించారని, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌రావు అన్నారు. మండలంలోని చిల్లకూరులో పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎంపీపీ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డితో కలిసి ప్రారంభించారు. చిల్లకూరుకు వచ్చిన వారిని సర్పంచ్ బసివిరెడ్డి వెంకట శేషారెడ్డి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ పంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. పంచాయతీకి మంజూరైన కంప్యూటర్ గదిని ఎమ్మెల్యే కిలివేటి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ ప్రజాసేవే ధ్యేయంతో పనిచేసి ప్రజలకిచ్చిన మాట ప్రకారం అభివృద్ధి సాధిస్తామన్నారు. రాష్ట్ర ప్రజలను నమ్మించి అందలమెక్కిన  చంద్రబాబునాయుడు ఊసరవెల్లి మాటలతో ఎన్నికల వాగ్దానాలకు తిలోదకాలు వదిలారని ఎమ్మెల్యే కిలివేటి దుయ్యబట్టారు. అనంతరం పంచాయతీ కార్యాలయ ఆవరణంలో ఎంపీ, ఎమ్మెల్యే, ఎంపీపీ మొక్కలు నాటారు.
 మోడల్ విలేజ్‌గా చిల్లకూరు:
 ప్రధాని మోడీ సూచనల మేరకు తిరుపతి పార్లమెంట్ పరిధిలో చిల్లకూరు పంచాయతీని మోడల్ విలే జ్‌గా దత్తత తీసుకోవాలని ఎంపీపీ సత్యనారాయణరెడ్డి ఎంపీ వెలగపల్లికి విజ్ఞప్తి చేశారు. కామిరెడ్డి కోరిక మేరకు ప్రజల విజ్ఞప్తితో చిల్లకూరు పంచాయతీని దత్తత తీసుకొని మోడల్ విలేజ్‌గా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
 ఘన సన్మానం:
 పుల్లూరులో సర్పంచ్ మారాబత్తిన సుధాకర్ ఎంపీ వరప్రసాద్‌రావు, ఎమ్మెల్యే సంజీవయ్య, ఎంపీపీ సత్యనారాయణరెడ్డిలను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ కార్యకర్తలకు అండగా నిలిచిన సత్యనారాయణరెడ్డి సేవలను కొనియాడారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఓడూరు గిరిధర్‌రెడ్డి, నాయుడుపేట మండల కన్వీనర్ తంబిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ సరళ, డిప్యూటీ తహశీల్దార్ రవికుమార్, వైద్యాధికారులు రమణయ్య, వికాస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అధికారులు హరిబాబు, మనోజ్‌కుమార్, శీనయ్య, శ్రీనివాసశౌరీ, ఎంఈఓ తిరుపాలు, ఈఓపీఆర్‌డీ వెంకటరమణ, పంచాయతీ కార్యదర్శులు వెంకట్రావు, నాగూరయ్య, రమాదేవి, మధుమోహన్‌దాస్, వీఆర్వోలు, నాయకులు మురార్జిరెడ్డి, వెంకటశేషారెడ్డి, రమణారెడ్డి పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు