ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే పాదయాత్ర

5 Nov, 2017 12:16 IST|Sakshi

ఒంగోలు అర్బన్‌: రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని వారికి భరోసా కల్పించేందుకే వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర చేయనున్నారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఒంగో లులోని తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ అధికారం చేపట్టిన మూడున్నరేళ్లలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగిందన్నారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణమాఫీ తూతూమంత్రంగా జరి గిందని మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అన్న చంద్రబాబు నిరుద్యోగ యువతని మోసగించాడని అన్నారు.  రాష్ట్రంలో అధికారపార్టీ లోపాలను, ప్రజల ఇబ్బందులను గుర్తించి వైఎస్‌ జగన్‌ ప్రజా సమస్యలు తెలుసుకొని భరోసా కల్పించేందుకు పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. 6వ తేదీ ఇడుపులపాయ నుంచి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర జరుగుతుందన్నారు. 

దీనిలో అన్నీ వర్గాల ప్రజలతో జగన్‌ నేరుగా మమేకమవుతారని తెలిపారు. పాదయాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. పాదయాత్రకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పోలీసు ఉన్నతాధికారికి అందజేశామని తెలిపారు. అయితే సదరు అధికారి దాంతోపాటు అనుమతి కోరుతూ లేఖ ఇవ్వాలని తెలపడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని తాము చెప్పడంతో.. నాయకుల బృందం పర్యటన వివరాలు తెలపాల్సిందిగా డీజీపీ కోరినట్లు చెప్పారు. గతంలో దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసిన విషయాన్ని గుర్తుచేశారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర ఎటువంటి అనుమతులు లేకుండా చేశారన్నారు. 

టీడీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ వైఎస్సార్‌ సీపీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించకుండా పార్టీలో చేర్చుకుని మంత్రి పదవులు కట్టబెట్టడం దుర్మార్గమన్నారు. చట్టసభల్లో ప్రతిపక్ష పార్టీ గొంతు నులిమే అధికార పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించినట్లు తెలిపారు. ప్రైవేటు కాలేజీల్లో విద్యార్థులపై ఒత్తిడి పెరిగి ఆత్మహత్యలు జరగడం దారుణమన్నారు. దీనిపై బాలల హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని, ప్రైవేటు, కాలేజీలు, హాస్టళ్లను పరిశీలించేందుకు త్వరలో బృందం వస్తుందన్నారు. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు హాస్టళ్ల నిర్వహణలో తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తున్నాయని, అనుమతులు లేని కాలేజీలు కూడా ఉన్నాయన్నారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కెవి.రమణారెడ్డి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు