ఇంటికెళ్లండి ప్లీజ్‌..! 

28 Mar, 2020 08:11 IST|Sakshi
రోడ్లపై తిరుగుతున్న వారిని చేతులు జోడించి వేడుకుంటున్న భూమన కరుణాకర రెడ్డి, తిరుపతిలో తిరుగుతున్న వాహనచోదకులకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు

రోడ్డుపైకి వచ్చిన  జనానికి కౌన్సెలింగ్‌

బాధ్యత గుర్తుచేస్తున్న  ప్రజాప్రతినిధులు, పోలీసులు 

సాక్షిప్రతినిధి, తిరుపతి: కరోనా వైరస్‌ నివారణకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. ప్రజలు గుంపులుగా చేరకూడదంటూ 144 సెక్షన్‌ విధించింది. నిత్యావసరాల కొనుగోలుకు మాత్రం ఇంటికి ఒకరికి నిర్దేశిత సమయంలో వెసులుబాటు కల్పించింది. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంచార వాహనాలతో ముమ్మరంగా ప్రచారం సాగిస్తోంది. అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రావద్దని, సామాజిక దూరం పాటించాలని పోలీసులు కోరుతున్నారు.  నిబంధనలను అతిక్రమించిన వారిపై  కేసులు నమోదు చేసి జైలుకు సైతం పంపిస్తున్నారు. అప్పటికీ రోడ్లపైకి వస్తున్న వారికి కౌన్సెలింగ్‌ ద్వారా అవగాహన కల్పించేందుకు పోలీసులతో కలిసి ప్రజాప్రతినిధులు శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఇంటి పట్టున ఉండండి, ముంచుకొస్తున్న ముప్పును గుర్తించండి అంటూ చేతులు జోడించి అభ్యర్థిస్తున్నారు. ఇతర దేశాల్లో ఏర్పడిన విపత్కర పరిస్థితులను అర్థం చేసుకుని అప్రమత్తంగా వ్యవహరించాలని విన్నవిస్తున్నారు.
(అమెరికా: 4 నెలల్లో 81 వేల కరోనా మరణాలు? )

జిల్లావ్యాప్తంగా  ప్రజాప్రతినిధులు, పోలీసులు ప్రజలను చైతన్యవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నిత్యావసర సరుకుల కొనుగోలు సమయంలో మార్కెట్లు, దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించాలని కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. రోడ్డుపైకి వచ్చిన వారిని ఎక్కడికక్కడ అడ్డుకుని బాధ్యతను గుర్తుచేస్తున్నారు. జిల్లా మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను సమాయత్తం చేస్తున్నారు.  తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నిత్యం నగరంలో పర్యటిస్తూ వీధుల్లో సంచరిస్తున్న వారిని ఇళ్లకు వెళ్లాలని సూచిస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తన నియోజకవర్గంలోని అన్ని ఇళ్లకు సుమారు 3.40లక్షల శానిటైజర్స్‌ పంపిణీ చేశారు. నగరి ఎమ్మెల్యే ఆర్కేరోజా, పీలేరు శాసనసభ్యుడు చింతల రామచంద్రారెడ్డి తమ ప్రాంతాల్లోని ప్రజలకు మాస్క్‌లను పంపిణీ చేసి కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల లండన్‌ నుంచి శ్రీకాళహస్తికి వచ్చిన ఓ యువకుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి వెంటనే అప్రమత్తమయ్యారు. పట్టణంలో హైడ్రోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. అలాగే నియోజకవర్గవ్యాప్తంగా శానిటైజర్స్‌ను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. చిత్తూరు, సత్యవేడు, పలమనేరు, పూతలపట్టు, తంబళ్లపల్లె, మదనపల్లె ఎమ్మెల్యేలు  ఆరణి శ్రీనివాసులు, కోనేటి ఆదిమూలం, వెంకటేగౌడ, ఎంఎస్‌ బాబు, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, నవాజ్‌బాషా ఆయా ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు విశేషంగా కృషి చేస్తున్నారు.

మరిన్ని వార్తలు