-

భ్రమరావతిగా మార్చారు

18 Jan, 2020 04:38 IST|Sakshi
బహిరంగ సభలో మాట్లాడుతున్న మంత్రి శంకరనారాయణ, చిత్రంలో ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, డాక్టర్‌ సిద్ధారెడ్డి, దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి తదితరులు

‘అనంత’ రైతుల బహిరంగ సభలో చంద్రబాబుపై ప్రజాప్రతినిధుల మండిపాటు

అనంతపురం: ‘పదిమందికీ అన్నం పెట్టే రాయలసీమ ప్రాంత రైతులు తీవ్ర కరువుతో ఇతర రాష్ట్రాలకు వెళ్లి భిక్షాటన చేస్తున్నారు. ఎంతోమంది రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఏనాడూ వారి కోసం జోలె పట్టని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం వేలాది ఎకరాలు కొన్న తమ జాతి నాయకులు, బినామీల భూములకు మంచి ధర రావాలనే ఉద్దేశంతో రాజధానిని అమరావతిలోనే నిర్మించాలంటూ భిక్షాటన చేయడం సిగ్గు చేటు’ అని వక్తలు మండిపడ్డారు. ‘లక్ష కోట్ల రాజధాని  వద్దు–సాగునీటి ప్రాజెక్టులే ముద్దు’ అనే నినాదంతో జిల్లాలోని రైతులంతా శుక్రవారం అనంతపురంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.

స్థానిక టవర్‌ క్లాక్‌ కూడలి నుంచి సప్తగిరి సర్కిల్‌ వరకు వేలాదిమంది రైతులు ప్రదర్శనగా తరలి వెళ్లారు. అక్కడ వైఎస్సార్‌సీపీ అనంతపురం పార్లమెంటరీ అధ్యక్షుడు నదీంఅహ్మద్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి శంకరనారాయణ, ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, డాక్టర్‌ సిద్ధారెడ్డి, దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతి ప్రాంతంలో చంద్రబాబు, ఆయన బినామీలు భూములు కొని అక్కడ రాజధాని ఏర్పాటు చేశారన్నారు.

బంగారు పంటలు పండుతున్న భూముల్ని రైతుల నుంచి బలవంతంగా లాక్కున్నారని, రూ.లక్ష కోట్ల పెట్టుబడితో ప్రపంచస్థాయి రాజధానిని నిర్మిస్తామని, ఎకరం రూ.20 కోట్లు ధర పలికేలా చేస్తామని నమ్మించారన్నారు. చివరకు అవేమీ చేయకుండా అమరావతిని భ్రమరావతిగా మార్చారన్నారు. ఆరోజు భ్రమ కల్పించారు కాబట్టే తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు కృత్రిమ ఉద్యమాలను సృష్టిస్తూ ప్రభుత్వంపై ఆ ప్రాంత రైతులను ఉసిగొల్పుతున్నారన్నారు. 13 జిల్లాల ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం పాలన వికేంద్రీకరణకు పూనుకుందని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు అన్ని ప్రాంతాల ప్రజలు అండగా నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు.

మరిన్ని వార్తలు