కలెక్టర్ దూకుడుకు కళ్లెం వేయండి!

15 Mar, 2015 04:10 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, విజయవాడ : జిల్లా కలెక్టర్ బాబు.ఎ పై ప్రజాప్రతినిధులు కత్తులు దూస్తుండగా, ఉద్యోగ సంఘాల వారు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం పలువురు ఎమ్మెల్యేలు కలెక్టర్ పనితీరును తప్పుపడుతూ సీఎంకు ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం జిల్లాకు చెందిన కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు ఎన్‌జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు ద్వారా సీఎంను కలిసి కలెక్టర్ బాబు తీరును వివరించారు. అధికారులను చిన్నా పెద్దా తేడా చూడకుండా విరుచుకు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన దూకుడుకు కళ్లెం వేయాలని సీఎంను వారు కోరారు.
 
తగిన గౌరవం ఇవ్వడం లేదు...
పలువురు ఎమ్మెల్యేలు సీఎం వద్ద జిల్లా కలెక్టర్ పనితీరును తప్పుపట్టారు. తాము నిత్యం ఏదోక పనిపై వెళుతుంటామని, వస్తున్నట్లు ముందే చెప్పినా కలెక్టర్ పట్టించుకోవడం లేదని చెప్పారు. ఎమ్మెల్యే హోదాలో వెళ్లినా తగు గౌరవం ఇవ్వటం లేదని తెలిపారు. టీడీపీ పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు, పామర్రు నియోజకవర్గ ఇన్‌చార్జి వర్ల రామయ్య, గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ సీఎం వద్ద కలెక్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి అధికారి ఉంటే పనులు చేయించడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నట్లు తెలిపారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ భార్య మాధవీలత కృష్ణా జిల్లా డ్వామా పీడీగా పనిచేస్తున్నారు. కలెక్టర్ సమీక్షల సమయంలో మందలించడంపై తనకు జరిగిన అవమానాన్ని ఆమె తన భర్తకు వివరించినట్లు సమాచారం. శ్రావణ్‌కుమార్ గతంలో జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేశారు. శ్రావణ్‌కుమార్, కాగిత వెంకట్రావు నేరుగా సీఎంతో మాట్లాడి ఆయనపై చర్యలు తీసుకోవాలని గట్టిగా చెప్పినట్లు సమాచారం.
 
అదే బాటలో ఉద్యోగ సంఘాల నాయకులు...
వివిధ శాఖలకు చెందిన ఉద్యోగ సంఘాల నాయకుల వద్ద జిల్లా, మండల స్థాయి అధికారులు కలెక్టర్ తీరుపై మొరపెట్టుకుంటున్నారు. సమీక్షల పేరుతో గంటల తరబడి అధికారులను ప్రశ్నిస్తున్నారని, ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సమీక్షలు కొనసాగిస్తున్నారని వారు చెబుతున్నారు. సమీక్షల సమయంలో కలెక్టర్‌ను కలిసేందుకు ఎవరు వచ్చినా పట్టించుకోవడం లేదని, గంటల తరబడి వేసి చూసి వెనుదిరిగి వెళుతున్నారని పేర్కొంటున్నారు. సమీక్ష నిర్వహించే సమయంలో అధికారులు సరైన సమాధానం చెప్పకపోతే యూజ్‌లెస్, అన్‌ఫిట్ అంటూ అవమానపరుస్తున్నారని వారు తమ సంఘ నాయకుల వద్ద వాపోయారు. దీంతో పలు సంఘాలకు చెందిన నాయకులు ఎన్‌జీవో సంఘ నేతలతో కలిసి శనివారం సీఎంను కలిశారని, ఈ విషయం వివరించారని సమాచారం.
 
వారంలో ఐదు రోజులు సమీక్షలా...
వారంలో ఐదు రోజులు సమీక్షలు ఉంటున్నాయని, సాయంత్రం మూడు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కలెక్టర్ సమీక్షలు పెడుతున్నారని, సమీక్ష సమావేశానికి వెళ్లిన అధికారులు ఎప్పుడు తిరిగి వస్తారో తెలియని పరిస్థితి ఉందని కొందరు అధికారులు చెబుతున్నారు. కొన్ని శాఖలను ఒకేసారి పిలిచి సమీక్ష పేరుతో కూర్చోబెడతారని, ఒక శాఖతో మాట్లాడే సమయంలో వేరే శాఖ వారు ఊరకే కూర్చోవాల్సి వస్తోందని పేర్కొంటున్నారు.

కొందరు అధికారులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని వాపోతున్నారు. మచిలీపట్నంలోని కలెక్టర్ కార్యాలయానికి వెళితే తిరిగి ఇంటికి వచ్చే సరికి రాత్రి రెండు గంటలవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితి నుంచి తమను గట్టెక్కించాలని ఉద్యోగులు ఆయా సంఘాల నాయకుల వద్ద వాపోయారు.
 
రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆగ్రహం

విధినిర్వహణ ముగిసిన తరువాత కలెక్టర్ ఆదేశాలకు సహకరించేది లేదని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నిర్ణయించింది. జాబ్ చార్ట్‌లో లేని పనులను ఎప్పుడంటే అప్పుడు చేయమంటే ఎలా చేస్తామని వారు ప్రశ్నించారు. రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ శనివారం సాయంత్రం ఆరు గంటలకు విజయవాడలో సమావేశమైంది. తమ ఇబ్బందులను చర్చించడంతో పాటు తహశీల్దార్‌లు, ఇతర అధికారులను కలెక్టర్ అవమానకరంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. మహిళా తహశీల్దార్‌లను కూడా ఇష్టానుసారం మాట్లాడుతుండటంపై సమావేశం గర్హించింది.
 
క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు...

కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. పాఠశాలలు, ప్రభుత్వ రేషన్ షాపులు, మండల స్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ఏరోజు ఏ ఊర్లో తనిఖీకి వెళతారో అధికారులకు ముందుగా తెలియడం లేదు. కలెక్టర్ వచ్చి తనిఖీ చేసి వెళ్లిన విషయం తెలుసుకున్న తహశీల్దార్ ఏం జరుగుతుందోననే భయంతో వణికిపోతున్నారు. టెక్నాలజీని అందుకోలేకపోతున్నారు..
 
ఈ పోస్ విధానం ద్వారా రేషన్ సరకుల పంపిణీని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. కంప్యూటర్ నాలెడ్జ్ డీలర్‌లకు సరిగా లేకపోవడంతో 15వ తేదీ వస్తున్నా రేషన్ పంపిణీ పూర్తి కాలేదు. దీంతో డీలర్లపై కలెక్టర్ ఆగ్రహంతో ఉన్నారు. పేపర్ లెస్‌గా వర్క్ జరగాలని కలెక్టర్ భావిస్తున్నారు. ప్రతి సర్టిఫికెట్, ఇతర కాగితాలు ఏమి కావాలన్నా కంప్యూటర్‌లో ప్రింట్ తీసి డిజిటల్ సంతకం ద్వారానే ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఒక్క రెవెన్యూ కార్యాలయాల్లో మాత్రమే సాధ్యమవుతున్నది. అధికారులు టెక్నాలజీని అందుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. దీంతో అధికారుల తీరును కలెక్టర్ తప్పు పడుతున్నారు. మరోపక్క టెక్నాలజీలో లోపాలను కూడా సరిదిద్దాల్సి ఉందని సమాచారం.
 
కలెక్టర్ ఆలోచన మంచిదే కానీ...

జిల్లాలో వేగంగా పనులు జరగాలని కలెక్టర్ చేస్తున్న ఆలోచన మంచిదే. కానీ అందరినీ ఇబ్బందులపాలు చేసే ఆలోచన ఎందుకనేది పలువురి ప్రశ్న. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న ఉద్యోగులను గుర్తించి వారి ద్వారా కావాల్సిన పనులు చేయిస్తే బాగుంటుందనేది పలువురి వాదన. వచ్చే ఏడాదిలో రిటైరయ్యే జాబితాలో సుమారు 12 మంది తహశీల్దార్‌లు, ఇతర అధికారులు ఉన్నారు. వీరు ఇప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్‌ను వంట బట్టించుకోవాలంటే సాధ్యమయ్యే పనికాదని పలువురు ఉద్యోగులు చెబుతున్నారు.

తహశీల్దార్‌లకు కనీసం డిజిటల్ సిగ్నేచర్ చేసే సమయం కూడా లేకపోవడంతో కంప్యూటర్ ఆపరేటర్స్‌ను నమ్మి వారికి ఇస్తే వారు అమ్మేస్తున్నారు. ఈ సంఘటనలు ఇటీవల కొన్ని జరిగాయి. ఇటువంటి ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. జిల్లా కలెక్టర్‌గా అందరి బాగోగులు చూడాల్సిన బాధ్యత కలెక్టర్‌పై ఉంటుందనే విషయాన్ని విస్మరించ కూడదని పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు