నిలిచిన రూ.800 కోట్ల లావాదేవీలు

11 Feb, 2014 01:18 IST|Sakshi
 సాక్షి, రాజమండ్రి :నగదు లెక్కించే చేతులు పిడికిళ్లెత్తాయి. కంప్యూటర్ల ముందుకు కూర్చుని ఆర్థిక లావాదేవీల్లో తలమునకలయ్యే వారు ఎలుగెత్తి నినదించారు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించాలన్న డిమాండ్‌తో బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన రెండురోజుల దేశవ్యాప్త సమ్మెలో తొలిరోజైన సోమవారం జిల్లాలోని 150 బ్యాంకులకు చెందిన 550కి పైగా శాఖలు మూత పడ్డాయి. జిల్లావ్యాప్తంగా    10 వేలమందికి పైగా బ్యాంక్ అధికారులు, ఇతర సిబ్బంది విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొనడంతో సుమారు రూ.800 కోట్ల మేర లావాదేవీలు స్తంభించాయి. మంగళవారం కూడా సమ్మె కొనసాగనుండడంతో ఏటీఎంలలో కూడా నగదు లభ్యం కాని పరిస్థితి ఎదురు కావచ్చు. వివిధ బ్యాంకుల ఉద్యోగ సంఘాలన్నీ ‘యునెటైడ్ ఫెడరేషన్ ఆఫ్ బ్యాంకు ఎంప్లాయీస్’గా ఏర్పడి సమ్మెకు పిలుపునిచ్చాయి.  జిల్లాలో అత్యధికంగా బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నవి ఆంధ్రా బ్యాంక్, స్టేట్ బ్యాంకు గ్రూపు బ్యాంకులు. రాజమండ్రి, కాకినాడ, 
 
 అమలాపురంలతో పాటు మొత్తం 110 ఆంధ్రా బ్యాంకు, 107 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇం డియా, 40 స్టేట్ బ్యాక్ ఆఫ్ హైదరాబాద్ శాఖ లు మూతపడ్డాయి. ఇవి కాక యాక్సిస్ బ్యాం కు- 12, హెచ్‌డీఎఫ్‌సీ-15, బ్యాంక్ ఆఫ్ బరోడా-33, బ్యాంక్ ఆఫ్ ఇండియా-18, యూకో బ్యాంకు-14 శాఖలు, ఇంకా వివిధ బ్యాంకులకు చెందిన మరో 150 శాఖల్లో కూడా లావాదేవీలు నిలిచిపోయాయి. సమ్మె విషయం తెలియక వచ్చిన ఖాతాదారులు నిరాశతో వెనుదిరిగారు. రాజమండ్రి నగర పరిధిలో 750, కాకినాడలో  700, అమలాపురంలో 500 మంది ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తమతమ బ్యాంకుల ముందు సమావేశమై, తమ డిమాండ్లను వినిపిస్తూ నినాదాలు చేశారు. బ్యాంకింగ్ రంగంలోకి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలను అనుమతించడం ద్వారా బ్యాంకుల జాతీయకరణ ఆశయానికి తూట్లు పొడుస్తోందని అభ్యంతరం వ్యక్తం చేశారు. పదో వేతన సవరణ అమలులో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు.  ఔట్ సోర్సింగ్ నియామకాల్ని నిరసించారు. 
 
మరిన్ని వార్తలు