స్తంభించిన బ్యాంకు కార్యకలాపాలు

11 Feb, 2014 01:39 IST|Sakshi
 సాక్షి, గుంటూరు :జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు సోమవారం మూతపడ్డాయి. ఉద్యోగులందరూ సమ్మెలో పాల్గొనడంతో జిల్లాలోని ఎ‌స్‌బీఐ, ఎస్‌బీహెచ్, ఆంధ్రా, చైతన్యగ్రామీణ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలు తెరుచుకోలేదు. 280 శాఖల్లో పనిచేస్తున్న మొత్తం 5260 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ఉద్యోగుల వేతన సవరణ విషయంలో కేంద్రం అవలంభిస్తున్న వైఖరికి నిరసనగా నెల రోజుల కిందటే సమ్మె నోటీసు అందజేసిన ఉద్యోగ సంఘాల నాయకులు అపరిష్కృతంగా మిగిలిన వివిధ సమస్యల్ని ఉన్నతాధికారులకు వివరించారు. సరైన స్పందన రాకపోవడంతో సోమవారం సమ్మె ప్రారంభించారు.  జిల్లాలోని నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయిస్, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యూనియన్లలోని ఉద్యోగులందరూ ఏకతాటిపైకి వచ్చి సమ్మెలో పాల్గొన్నారు.
 
 జిల్లాలో బ్యాంకు  కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. గుంటూరు, నర్సరావుపేట, తెనాలి, బాపట్ల, పొన్నూరు, రేపల్లె, మంగళగిరి, చిలకలూరిపేట, వినుకొండ, మాచర్ల, సత్తెనపల్లి పట్టణాలోనూ సంపూర్ణంగా సమ్మె నిర్వహించారు. ఉద్యోగ సంఘ నాయకులు బ్యాంకు గేట్ల ముందు అరగంట సేపు నిరసన నినాదాలు చేసి వెళ్లిపోయారు. ఉద్ధృం చేస్తాం.. గుంటూరు నగరంపాలెంలోని భారతీయస్టేట్‌బ్యాంక్ ప్రధాన కార్యాలయం, కొరిటెపాడు ఆంధ్రాబ్యాంకుల ఎదుట ఉద్యోగ సంఘాల నాయకులందరూ సమష్టిగా సోమవారం ఉదయం నిరసన ప్రదర్శన నిర్వహించారు. కేంద్రం వైఖరిని విమర్శించారు. న్యాయబద్ధమైన తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ స్టాఫ్ యూనియన్ ఏపీ సర్కిల్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కృష్ణ కిషోర్, నాయకులు జీ కిషోర్ కుమార్, పీ ప్రసాద్, ఎన్ శ్రీనివాసాచార్యులు, వాసుదేవరావు, ఎం. సుధాకరరావు తదితరులు పాల్గొన్నారు. 
 
 నేడూ సమ్మె కొనసాగింపు.. 
 కొరిటెపాడు: కొరిటెపాడు ఆంధ్రాబ్యాంక్ వద్ద  సోమవారం నిర్వహించిన సమావేశంలో బ్యాంక్ ఉద్యోగుల సమన్వయ సంఘం జిల్లా కార్యదర్శి పి.కిషోర్‌కుమార్ మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక సంస్కరణలకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో మరిన్ని పోరాటాలు చేస్తామని చెప్పారు. సమ్మె మంగళవారం కూడా కొనసాగుతోందని తెలిపారు. ఏఐటియుసి జిల్లా కార్యదర్శి వి.రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ ఉద్యోగులు చేస్తున్న న్యాయమైన సమ్మెకు తమ సహకారం ఉంటుందని తెలిపారు. సమావేశంలో వివిధ బ్యాంకుల యూనియన్ నాయకులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు