వంటిల్లు డీలా!

17 Jun, 2017 02:15 IST|Sakshi
వంటిల్లు డీలా!
కొండెక్కిన కూరగాయల ధరలతో జనం సతమతం
- ఘాటెక్కిన పచ్చి మిర్చి... భయపెడుతున్న క్యా‘రేట్‌’
చుక్కలతో పోటీ పడుతున్న చిక్కుళ్లు.. బియ్యం ధరలకూ రెక్కలు..
 
‘మా ఇంట్లో ఎప్పుడూ ఫ్రిజ్‌ నిండా కూరగాయలుండేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. నిన్న మార్కెట్‌కు రూ.500 తీసుకెళ్తే.. తెచ్చుకుందామనుకున్న కూరగాయల్లో సగమంటే సగం కూడా రాలేదు. మాకిష్టమైనవి కాకుండా ఏవి ధర తక్కువో అడిగడిగి కొనాల్సి వచ్చింది. ఈ ధరలు తగ్గేదాకా ఆకుకూరలతో సరిపెట్టుకోక తప్పదనిపిస్తోంది. ఉల్లిపాయలొక్కటే కొండెక్కలేదు. లేకపోతే పచ్చడి మెతుకులూ గగనమయ్యేవి’ అంటూ తిరుపతికి చెందిన స్వరూప వాపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో 90 శాతం మహిళలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 
 
సాక్షి, అమరావతి : కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పచ్చి మిర్చి ఘాటెక్కింది. బీన్స్, చిక్కుళ్లు, క్యారెట్‌ తదితర కాయగూరలు కందిపప్పు ధరను మించిపోయాయి. కొన్ని కూరగాయలైతే రెండు నెలల కిందటితో పోల్చితే రెండు, మూడు రెట్లు పెరిగాయి. భగ్గుమంటున్న ధరలను చూసి కూరగాయలు కొనేందుకు మార్కెట్‌కు వెళ్లాలంటేనే సామాన్య, దిగువ మధ్య తరగతి ప్రజలు భయపడుతున్నారు. కిలో బీన్స్‌/ చిక్కుళ్లు / క్యారెట్‌..  ప్రాంతం, నాణ్యతను బట్టి రూ.80 నుంచి రూ.90 వరకూ పలుకుతున్నాయి. బహిరంగ మార్కెట్‌లో కిలో పచ్చి మిర్చి రూ.80 – 85 పలుకుతోంది. కాకర, గోరుచిక్కుడు, బీట్‌రూట్, కీరదోస, వంగ తదితర కూరగాయల ధరలు కూడా భారీగా పెరిగాయి.

విజయవాడ బహిరంగ మార్కెట్‌లో కిలో కంద గడ్డ రూ.70పైగా ఉంది. రైతు బజారు/ కాళేశ్వరరావు మార్కెట్‌లో కూడా కిలో కంద రూ.60కి పైగా అమ్మడం గమనార్హం. సాధారణ రోజుల్లో కిలో రూ.15, 20 ఉండే కీరదోస ప్రస్తుతం విజయవాడ రైతు బజారు/ కాళేశ్వరరావు మార్కెట్లో ఏకంగా రూ.45కి పెరిగింది. హైదరాబాద్‌ మార్కెట్‌లో కిలో ఉల్లి రూ.12 ఉండగా విజయవాడలో రూ.20 నుంచి 22 వరకూ అమ్ముతుండటం గమనార్హం. విజయవాడ బహిరంగ మార్కెట్‌లో కిలో టమోటా రూ.30పైగా ఉంది. రాష్ట్రంలో ప్రధాన నగరాలైన విశాఖపట్నం, తిరుపతితోపాటు చిన్న పట్టణాల్లో కూడా కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో పొట్ల కాయను దాదాపు అన్ని ప్రాంతాల్లో రూ.20కి అమ్ముతున్నారు.  
ఎండకు తోటలు ఎండిపోవడం వల్లే..
కరువు వల్ల నీరు లేక కూరగాయల తోటల సాగు తగ్గడం, ఎండలకు తోటలు ఎండిపోవడంతో దిగుబడి తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. అందువల్లే కూరగాయల ధరలు పెరిగాయని, మరో నెలన్నర పాటు ఈ ధరలు ఇలాగే ఉంటాయంటున్నారు. మూడు నాలుగు నెలలు కష్టపడి కూరగాయలు పండిచిన వారికి వచ్చే మొత్తం కంటే ఒకటి రెండు రోజులు మార్కెట్‌లో పెట్టి అమ్మేవారు, దళారులే ఎక్కువ డబ్బు పొందుతున్నారని రైతులు వాపోతున్నారు. ‘మార్కెట్‌లో కిలో పచ్చి మిర్చి రూ.80కి అమ్ముతున్నారు. మాకు మాత్రం రూ.40 కూడా ఇవ్వడం లేదు. మరీ ఇంత అన్యాయం చేస్తున్నారు...’ అని చిత్తూరు జిల్లా పెరుమాళ్లపల్లెకు చెందిన లోకనాథం నాయుడు అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ’కిలో చిక్కుడు కాయలు మావద్ద రూ.40కి తీసుకుంటున్నారు. వ్యాపారులేమో మార్కెట్‌లో రూ.75, 80 అమ్ముతున్నారు. ఇదేమని అడిగితే దుకాణం అద్దె, మనిషికి కూలీ, ఇతర ఖర్చులు అంటారు. మేం అమ్ముకోలేం కాబట్టి వారు చెప్పిన రేటుకు ఇచ్చి వెళ్లక తప్పడంలేదు’ అని వైఎస్సార్‌ జిల్లా సుండుపల్లికి చెందిన రైతు కులశేఖర్‌ అన్నారు. ధరలు ఇలా మండిపోతుంటే ఏమి తిని బతకాలంటూ పేదలు వాపోతున్నారు. 
 
బెంబేలెత్తిస్తున్న బియ్యం ధర
మార్కెట్‌లో బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. రెండు నెలల క్రితం వరకు సోనా మసూరి మొదటి శ్రేణి కొత్త బియ్యం కిలో రూ.33 ఉండేది. ఇప్పుడు ఇవే బియ్యం ధర రూ.37, 38కి పెరిగాయి. పాత బియ్యమైతే కిలో రూ.44 నుంచి ఏకంగా రూ.50కి పెరిగాయి. మంచి క్వాలిటీ అయితే కిలో రూ.52 – 55 వరకు అమ్ముతున్నారు. వంద కిలోల బస్తా సోనా మసూరి పాత బియ్యం రూ.5000 పలుకుతోంది. నిజామాబాద్‌ సన్నాలు పేరు చెప్పి రూ.5300 నుంచి రూ.5500 కూడా అమ్ముతున్నారు. రాష్ట్రంలో గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో వరి సాగు తగ్గడం వల్ల బియ్యం ధరలు పెరిగాయి. కర్నూలు సోనా మసూరి పేరు చెప్పి చాలా ప్రాంతాల్లో కల్తీ బియ్యం అంటగడుతున్నారు. ఎంపీయూ 1060 రకం ధాన్యం సోనా మాసూరి లాగా ఉంటుంది. దీనిని సోనామసూర బియ్యంలో 20 నుంచి 30 శాతం కలిపి అమ్ముతున్నారు. మరికొందరు తగ్గుబియ్యంలో రేషన్‌ బియ్యాన్ని పాలిష్‌ పట్టించి కలిపేస్తున్నారు.  
 
పుల్లగూరలే గతి...
నెల రోజులుగా ఎండలే అనుకుంటే కూరగాయల ధరలూ మండిపోతున్నాయి. అర కిలో కూరగాయలతో తాళింపు చేసుకునేటోళ్లం పావు కిలోకే పరిమితమయ్యాం. అందరికీ అందుబాటులో ఉండే వంకాయల ధర కూడా పెరిగిపోయింది. పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. తోటకూర, చిర్రాకు, బచ్చలాకుతో పుల్లగూర చేసుకుని కానిచ్చేస్తున్నాము. 
 – కనకదుర్గ, అజిత్‌సింగ్‌నగర్, విజయవాడ 
మరిన్ని వార్తలు