సమైక్య ‘భజన’

8 Dec, 2013 01:38 IST|Sakshi

=పులిచింతల సభలో సమైక్యవాదం
 = సీఎం గొంతుచించుకున్నా స్పందన కరువు
 = మధ్యలోనే సగం కుర్చీలు ఖాళీ
 = ప్రాజెక్టు కోసం కృషి చేసిన రైతుల ప్రస్తావన శూన్యం

 
 సాక్షి, విజయవాడ :  అధిష్టానంపై నిప్పులు చెరిగినా, తాను ఎంత సమైక్యవాదినని గొంతు చించుకున్నా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రసంగానికి సభికుల నుంచి స్పందన కరువైంది. పులిచింతలను జాతికి అంకితం చేసే సభను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పూర్తిగా విభజనపై తన వాదం వినిపించేందుకు ఉపయోగించుకున్నారు. పులిచింతల ఏర్పాటుకోసం తపించి, ఉద్యమాలు చేసిన రైతు నాయకుల ప్రస్తావన కూడా లేకుండా పోయింది. నిరసనలు వ్యక్తమవుతాయన్న భయంతో విజయవాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్టు చేశారు.

విజయవాడలో పట్టాల సమస్య, కార్పొరేషన్ ఉద్యోగులకు 010 పద్దు కింద జీతాలు, నగరంలో ముంపు ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపిస్తారంటూ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తన ప్రసంగంలో చెప్పినా.. సీఎం కనీసం పట్టించుకోలేదు. 13 లక్షల ఎకరాలకు సంబంధించి డెల్టా ఆయకట్టు స్థిరీకరణ ప్రాజెక్టు అయినప్పటికీ రైతులు ఈ సభకు రావడానికి ఆసక్తి చూపలేదు. దీంతో అధికారులు పూర్తిగా డీఆర్‌డీఏ ద్వారా డ్వాక్రా మహిళలను తరలించడంపై దృష్టి పెట్టారు. చాలా మందికి చెక్కులు ఇస్తామని ఆశపెట్టి తీసుకువచ్చారు. ఇక్కడకు వ చ్చాక బహిరంగ సభ కావడంతో సగం మంది వెనుతిరిగి వెళ్లిపోయారు.
 
జనాన్ని కదిలించలేకపోయిన ప్రసంగాలు...

శనివారం సాయంత్రం విజయవాడ స్వరాజ్‌మైదానంలో నిర్వహించిన బహిరంగ సభకు జనాన్ని తరలించగలిగిన కాంగ్రెస్ నేతలు తమ ప్రసంగాలతో వాళ్లను కదిలించలేకపోయారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి అధిష్టానాన్నే లక్ష్యంగా చేసుకొని మాటల తూటాలు పేల్చారు. కేంద్రంలో కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకోవడమే తప్పా అని ప్రశ్నించారు. 2004 తరువాతే రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందంటూ పరోక్షంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కృషిని సీఎం ప్రస్తావించారు.

మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ కెఎల్.రావు సాగర్ పులిచింతల ప్రాజెక్ట్ ప్రారంభంతో దశాబ్దాల నాటి కల నెరవేరిందన్నారు. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పులిచింతల ప్రాజె క్టుకు శంకుస్థాపన చేశారని చెబుతుండగా సభికుల నుంచి పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. జిల్లా ఇన్‌చార్జి మంత్రి తోట నరసింహం మాట్లాడుతూ 13 లక్షల ఎకరాలకు సాగునీరందించే పులిచింత ప్రాజెక్ట్ చరిత్రలో నిల్చిపోతుందన్నారు.
 
ఆకట్టుకోని లగడపాటి డైలాగులు...

జై సమైక్యాంధ్ర అంటూ విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వినూత్న తరహాలో ప్రసంగాన్ని ప్రారంభించినప్పటికీ జనాన్ని ఆకట్టుకోలేకపోయారు. సమైక్యాంధ్ర కోసం జరుగుతున్న ధర్మ పోరాటంలో సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి పద్మవ్యూహంలో అభిమన్యుడవుతాడా, లేక అర్జునుడవుతాడా అని దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోందంటూ సినీఫక్కీలో చేసిన డైలాగ్‌కు స్పందన కనిపించలేదు.
 
సగం ఖాళీ

పాలకపక్షం నేతలు, అధికార యంత్రాంగం గత వారం రోజులుగా హైరానాపడి సీఎం సభకు భారీగానే జనాన్ని తరలించగలిగారు. డ్వాక్రా మహిళలు, కిరాయి కార్యకర్తలతో ఎట్టకేలకు మధ్యాహ్నానికి సభాస్థలిని నింపగలిగారు. అయినప్పటికీ కాంగ్రెస్ నేతలు ప్రసంగాలు చేస్తుండగానే జనం కుర్చీల్లోంచి లేవడం ప్రారంభించారు. దీంతో అప్రమత్తమైన మంత్రులు వెంటనే మైక్ సీఎం చేతికి ఇచ్చారు.

అప్పటికే వెనక వైపు సగం కుర్చీలు ఖాళీ అయ్యాయి. రాష్ట్ర మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, కాసు కృష్ణారెడ్డి, మాణిక్య వరప్రసాద్, పితాని సత్యనారాయణ, వట్టి వసంతకుమార్, ఎమ్మెల్సీలు పాలడుగు వెంకట్రావ్, గాదె వెంకటరెడ్డి, సింగం బసవ పున్నయ్య, కృష్ణారెడ్డి, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ,  ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, యలమంచిలి రవి, దిరిశం పద్మజ్యోతి, డీవై దాస్, కారుమూరి నాగేశ్వరరావు (తణుకు), ఉగ్రనరసింహారెడ్డి (కనిగిరి), మాజీ ఉపసభాపతి బూరగడ్డ వేదవ్యాస్, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు