పులిచింతల రిజర్వాయర్కు భారీగా వరద నీరు

27 Oct, 2014 09:01 IST|Sakshi
పులిచింతల రిజర్వాయర్కు భారీగా వరద నీరు

గుంటూరు : పులిచింతల రిజర్వాయర్కు భారీగా వరద నీరు చేరుతోంది. దాంతో అధికారులు తొమ్మిది గేట్లను 2 మీటర్ల మేర ఎత్తివేశారు. 90,740 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుత నీటిమట్టం 11.67 టీఎంసీలు ఉంది. మరోవైపు ప్రాజెక్ట్ పరిధిలోని ముంపు గ్రామాలకు నీటి ప్రవాహం రోజు రోజుకూ పెరుగుతోంది.

 

నెల రోజుల నుంచి పులిచింతల ప్రాజెక్ట్ పరిధిలో నీరు నిల్వ ఉండటంతో ముంపు గ్రామాలైన పులిచింతల, కోళ్లూరు, గొల్లపేట, చిట్యాల, చిట్యాల తండా, బోదనం, గోపాలపురం, కామేపల్లి గ్రామాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి.  ఆదివారం ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నీరు చేరటం, అధిక వర్షాలు కురవటంతో నీటిమట్టం గణనీయంగా పెరిగింది. ముంపు గ్రామాల్లోకి పది అడుగుల మేర నీటి ప్రవాహం పెరగడంతో ముంపు గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారు.


గుంటూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు

గుంటూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కుప్పదండి, ఓగేరు, చంద్రవంక, కొండవీటి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మంగళగిరి, వెల్దుర్తి, దుర్గి, గురజాల మండలాల్లో పంట పొలాలు నీట మునిగాయి. గుంటూరు శివారు కాలనీలు జలమయం అయ్యాయి. రెంటచింతల సమీపంలో గోలివాగు ఉధృతంగా ప్రవహించటంతో మాచర్ల, గుంటూరుకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రొంపిచర్ల మండలంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. కాగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రైవేట్ విద్యాసంస్థలకు యాజమాన్యం సెలవు ప్రకటించింది.

మరిన్ని వార్తలు