నాని అనుచరుల బరితెగింపు

4 Feb, 2019 08:15 IST|Sakshi
రుయాకు ఎమ్మెల్యే చెవిరెడ్డిని తరలిస్తున్న పోలీసులు

చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై దాడి డీఎస్పీ, మహిళలపై కూడా..

ముగ్గురు మహిళలకు గాయాలు

పరుగులు తీసిన స్థానికులు తీవ్ర తోపులాట..

స్పృహతప్పిన ఎమ్మెల్యే రుయాకు తరలింపు

నాని అనుచరులపై లాఠీచార్జ్‌

తిరుపతి రూరల్‌: నిన్న మొన్నటి వరకు చిత్తూరులోనే దౌర్జన్యాలు, రౌడీ రాజకీయాలు, హత్యలు, హత్యాయత్నాలను చూశాం. చంద్రబాబు పుణ్యాన ఆ రౌడీ సంస్కృతి పుణ్యక్షేత్రాలకు నిలయమైన చంద్రగిరి నియోజకవర్గానికి సైతం అంటుకుంది. టీడీపీ అభ్యర్థిగా నానిని చంద్రబాబు ప్రకటించిన నాటి నుంచి దళితులు, ముస్లింలు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై రోజూ ఎక్కడో అక్కడ దాడులు జరుగుతూనే ఉన్నాయి. దానికి అనుగుణంగానే నాని సైతం రౌడీయిజం పుట్టిన చిత్తూరు నుంచి వచ్చానని హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో చిత్తూరు నుంచి వచ్చిన ముగ్గురు యువకులు శనివారం రాత్రి తుమ్మలగుంట ఉప్పరపల్లి గ్రామంలో ఫ్లెక్సీలను చించుతూ గ్రామçస్తులపై దాడికి ప్రయత్నించారు. గ్రామస్తులు వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

ఎమ్మెల్యే చెవిరెడ్డిపై దాడి:  ఇప్పటి వరకు గ్రామ, మండల స్థాయిలో దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడుతున్న నాని అనుచరులు మరింత రెచ్చిపోతున్నారు. సాక్షాత్తూ ఎమ్మెల్యేపైనే దాడి చేశారు. చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్‌ మండలం వేదాంతపురంలో ఆదివారం జరిగిన పసుపు– కుంకుమ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే హోదాలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం అందించే సహాయం పార్టీలకు, వ్యక్తులకు సంబంధం ఉండదన్నారు. ముఖ్యమంత్రి అందిచే చెక్కులయినా, రాబోయే రోజుల్లో జగనన్న ప్రకటించినట్లు డ్వాక్రా రుణాల మాఫీకి సంబంధించిన నగదుకు అయినా ప్రజల సొమ్ములేనని ఆయన అన్నారు. దీనిపై నాని అనుచరులు రాద్ధాంతం చేశారు. పసుపు–కుంకుమ మా పార్టీ కార్యక్రమం అంటూ రచ్చ చేశారు. ఎమ్మెల్యే ప్రసంగాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. పోలీ సులు వారించినా వినకుండా వారు ఎమ్మెల్యే చెవిరెడ్డిపై దాడికి తెగబడ్డారు.

ఎమ్మెల్యేకి రక్షణగా ఉన్న తిరుపతి వెస్ట్‌ డీఎస్పీ నాగేశ్వరరావుపై కారం పొడి చల్లారు. ఎంఆర్‌పల్లి సీఐ వెంకటేశ్వర్లుపై స్వీట్‌ ప్యాకెట్లను విసిరారు. ఎమ్మెల్యే చుట్టూ్ట ఉన్న గ్రామ మహిళలపై రాళ్లు రువ్వారు. వెనుక నుంచిజరిగిన ఈ దాడిలో ఎమ్మెల్యేతో పాటు డీఎస్పీ, సీఐ, ముగ్గురు మహిళలకు గాయాలయ్యాయి. పోలీసులతో నాని అనుచరులు వాగ్వివాదానికి దిగారు. మహిళలపై రాళ్ల దాడితో ఎమ్మెల్యే చలించిపోయారు. ‘నన్ను కొట్టాలనుకుంటే నన్నే కొట్టండి...మీరు ఏమి చేయదలచుకున్నారో అది చేయండి...మహిళల జోలికి మాత్రం వెళ్లొద్దని’  చెవిరెడ్డి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ వేదికపై ఎదురుగా నిలబడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో నాని అనుచరులను వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరించారు. పోలీసులకు, నాని అనుచరులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. తోపులాటలో ఎమ్మెల్యే  నలిగిపోయారు. స్పృహతప్పి కిందపడ్డారు. దీంతో నాని అనుచరులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. ఎమ్మెల్యేను పోలీస్‌ వాహనంలోనే రుయా ఆసుపత్రి అత్యవసర విభాగానికి తరలించారు. అధికారులు, సిబ్బందిపై కూడా కారం, రాళ్లు, స్వీట్ల ప్యాకెట్లతో దాడి జరగటంతో సభను వదిలి అర్ధంతరంగా వెళ్లిపోయారు.

శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది...
తోపులాట మధ్య నలిగిపోవటంతో ఎమ్మెల్యే చెవిరెడ్డికి శ్వాస తీసుకోవటంలో, బీపీ ఇబ్బంది వచ్చింది. ఊపిరి పీల్చుకోవటం కష్టం అయింది. రుయా సూపరిం టెండెంట్‌ సిద్దానాయక్‌ ఆధ్వర్యంలో వైద్య బృందం ఎమ్మెల్యేకు వైద్య పరీక్షలు చేశారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆరోగ్యం మెరుగుపడుతుందని, బీపీ కొంత ఇబ్బంది ఉందని వైద్యులు పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, చిత్తూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు, యువనేత భూమన అభినయ్‌ ఆసుపత్రికి వచ్చి చెవిరెడ్డిని పరామర్శించారు. ఎమ్మెల్యేపై దాడి ఘటనను తెలుసుకున్న నియోజకవర్గంలోని చెవిరెడ్డి అనుచరులు, అభిమానులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రుయా ఆసుపత్రికి తరలివచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మరిన్ని వార్తలు