దళితులపై దాడికి మరోసారి నాని అనుచరుల యత్నం

16 Nov, 2018 13:03 IST|Sakshi
వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై దాడికి ప్రయత్నిస్తున్న నాని అనుచరులను అడ్డుకుంటున్న పోలీసులు

వారించిన పోలీసులపై  తిరుగుబాటు

అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం నేరమా?

తిరుపతి రూరల్‌: పులివర్తి నాని అనుచరులు దళితుడిపై దాడి చేసి మూడు రోజులు అవుతున్నా నిందితులను అరెస్ట్‌ చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ నాయకులు, దళితులు గురువారం తిరుపతి రూరల్‌ మండలం వేదాంతపురం పంచాయతీ ఓటేరులో అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంబేడ్కరా.. నువ్వు రాసిన రాజ్యాంగాన్ని నువ్వే కాపాడు, దళితులకు రక్షణ కల్పించు అంటూ వేడుకున్నారు. ఆ సమయంలో పులివర్తి నాని అనుచరులు పలు వాహనాల్లో అక్కడికి చేరుకున్నారు.

వినతి పత్రాలతో ఏం పీకుతారురా? ప్రభుత్వం మాదిరా.. మొన్న వాడిని తన్నినా మీకు బుద్ధిరాలేదా? మరో నిమిషం ఇక్కడే ఉంటే మిమ్మల్ని తరిమికొడతాం.. అంటూ హెచ్చరించారు. వినతి పత్రం అందించేందుకు వచ్చిన వారిపై పోలీసుల సమక్షంలోనే దాడికి యత్నించారు. శాంతియుతంగా కార్యక్రమం చేసుకుంటుంటే దౌర్జన్యానికి పాల్పడడం మంచిది కాదని పోలీసులు నిలదీశారు. నాని అనుచరులు పోలీసులతోనూ దురుసుగా ప్రవర్తించారు. మాకే నీతులు చెబుతారా? అంటూ దుర్భాషలాడారు. నిరసన తెలుపుతున్న వారిపై దాడికి యత్నించారు. చివరి నిమిషంలో పరిస్థితిని గమనించిన పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నా వారు దాడికి తెగబడేవారే. నాని అనుచరుల వ్యవహార శైలిని చూసిన పోలీసులు, పరిస్థితి చేయి దాటుతుందని అప్రమత్తమయ్యారు. వారిని బలవంతంగా పక్కకు తీసుకెళ్లారు. దళితులు, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ నాయకులపై నాని అనుచరులు దౌర్జన్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో ఈ దౌర్జన్యాలు ఏమిటని అసహనం వ్యక్తం చేశారు.

పోలీసులు రాకపోతే మా పరిస్థితి ఏమిటి?
దళితులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవా లని శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం. ఇంతలోనే నాని అనుచరులు మాపై దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించారు. కులం పేరుతో దూషించా రు. పోలీసులు లేకపోతే మాపైనా దాడి చేసేవారు. వీరి దౌర్జన్యాలు చూస్తుంటే అసలు ప్రజాస్వామ్యం లో ఉన్నామా? అని సందేహంగా ఉంది. ప్రశాంత చంద్రగిరిలో రౌడీ రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తున్నారు. దౌర్జన్యం చేసిన వారితోపాటు చేయిం చిన వారిపైనా చర్యలు తీసుకోవాలి. లేకుంటే జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలను ఉద్ధృతం చేస్తాం. 
– దామినేటి కేశవులు, మల్లారపు వాసు,వెంకటరమణ, వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్‌ నాయకులు

అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు
తిరుచానూరు: శాంతియుతంగా అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం అందజేస్తున్న తమపై దౌర్జన్యానికి పాల్పడి కులం పేరుతో దూషించిన పులిపర్తి నాని అనుచరులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు దామినేటి కేశవులు, జిల్లా దళిత నాయకుడు మల్లారపు వాసు పోలీసులను కోరారు. వారు గురువారం రాత్రి తిరుచానూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ చంద్రగిరి మండలంలోని మొరవపల్లికి చెందిన దళితుడు రవిని పులివర్తి నాని అనుచరులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని పేర్కొన్నారు. దీనికి నిరసనగా గురువారం ఉదయం తిరుపతి రూరల్‌ మండలం ఓటేరు గ్రామంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి వినతి పత్రం అందజేసినట్టు తెలిపారు. ఆ సమయంలో పులివర్తి నాని అనుచరులు, టీడీపీ తిరుపతి రూరల్‌ అధ్యక్షుడు చెరుకుల జనార్దన్‌ యాదవ్, ఇస్మాయిల్‌తో పాటు మరికొందరు తమపైకి దూసుకొచ్చారని పేర్కొన్నారు. కులం పేరుతో దుర్భాషలాడారని తెలిపారు. మిమ్మల్ని చంపేస్తామంటూ బెదిరించారని వాపోయారు. అక్కడే ఉన్న పోలీసులు చొరవ తీసుకుని తమకు రక్షణ కల్పించి, వారిని అక్కడి నుంచి పంపించారని వివరించారు. పులివర్తి నాని అనుచరుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి న్యాయం చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు