‘పుంగనూరు జాతి’ పునరుత్పత్తి

5 Aug, 2014 01:32 IST|Sakshi
‘పుంగనూరు జాతి’ పునరుత్పత్తి
  • తిరుపతి, పలమనేరు కేంద్రంగా పిండమార్పిడి ప్రయోగం
  •  ప్రాజెక్టుకు రూ.1.3 కోట్లు అవసరం
  •  కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్న వర్సిటీ అధికారులు
  • అరుదైన పుంగనూరు రకం  పశువుల పునరుత్పత్తికి  శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ అధికారులు శ్రీకారం చుట్టారు. తిరుపతి, పలమనేరు ప్రాంతాలను పరిశోధనలకు కేంద్రంగా  నిర్ణయించారు. రాష్ట్రంలో  పుంగనూరు, ఒంగోలు జాతి పశువులను దేశ సంపదగా భావిస్తారు.
     
    వెటర్నరీ యూనివ ర్సిటీ :  పుంగనూరు జాతి ఆవుల పునరు త్పత్తికి శ్రీకారం చుట్టారు. ఉన్న వనరులను అంది పుచుకుంటూ అందరిచేతా శభాష్ అనిపిం చుకుంటున్నారు తిరుపతిలోని వెటర్నరీ యూనివర్సిటీ అధికారులు. అంతరించి పోతున్న వాటిల్లో పుంగూరు పశువుల జాతి మొదటి స్థానంలో ఉంది. వీటి పునరుత్పత్తికి ఇప్పటి వరకు వెటర్నరీ వర్సిటీ పెద్దగా చర్యలు చేపట్టలేదు. పలమనేరు సమీపంలోని క్యాటిల్ ఫారం వద్ద పరిశోధన కేంద్ర ఏర్పాటు చేశారు.

    ఇక్కడ 91 పుంగనూరు జాతి పశువులు మాత్రమే ఉన్నాయి. వీటిలో కూడా పునరుత్పత్తికి కేవలం 25 పశువులు మాత్రమే యోగ్యమైనవి. క్యాటిల్‌ఫాంతో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. పుంగనూరు జాతి పశువులు అంతరించిపోతున్న నేపథ్యంలో వెరట్నరీ వర్సిటీపై పలువిమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో వెటర్నరీ డీన్ డాక్టర్ చంద్రశేఖర్‌రావు, ఇతర అధికారులు పుంగనూరు జాతి పశువుల పునరుత్పత్తికి శ్రీకారం చుట్టారు. ఇందుకు కావాల్సిన పరికరాలు, పిండమార్పిడికి అవసరమయ్యే పశువు లు, పరిశోధకులు, గైనకాలజిస్ట్, ఇతర సిబ్బంది వివరాలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

    తిరుపతి వెటర్నరీ కళాశాలలో ల్యాబ్ అందుబాటులో ఉన్నా ఇక్కడ పుంగనూరు రకం పశువులు, ఇతర సిబ్బంది లేరు. పలమనేరు ల్యాబ్‌లో పిండమార్పిడికి అవసరమయ్యే ఇతర జాతి పశువులు, గైనకాలజిస్ట్, శాస్త్రవేత్త అవసరమని గుర్తించారు. ఇందుకోసం రెండు ప్రాంతాల్లో పరిశోధనలు జరగాలంటే రూ.1.3 కోట్లు అవసరమని  అంచనా వేశారు. ఈ మేరకు నివేదికను సి ద్ధం చేశారు. కేంద్రం నుంచి అనుమతులు రాగానే పరిశోధనలు ప్రారంభమవుతాయని డీన్ ఆఫ్ వెటర్నరీ డాక్టర్ చంద్రశేఖర్‌రావు తెలిపారు.
     
    మేలైన  పుంగనూరు జాతి
     
    పుంగనూరు జాతి పశువులను దేశ సంపదగా భావిస్తారు. అంతరించి పోతున్న 32 రకాల దేశవాళీ రకాల్లో ఈ జాతి మొదటి స్థానంలో ఉంది.  85-95 సెంటీ మీటర్ల ఎత్తు, 125- 210 కిలోల బరువు ఉండడం వీటి ప్రత్యేకత. తెలుపు, ఎరుపు, గోధుమ రంగుల్లో ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. విదేశీయులూ పుంగనూరు జాతి పశువుల కోసం ఎగబడుతుంటారు. అన్నిరకాల వాతావరణ పరిస్థితులను ఈ పశువులు తట్టుకుని నిలబడగలవు. తక్కువ పోషణతో ఎక్కువ లాభాలు ఇవ్వడం వీటి ప్రత్యేకత.
     

మరిన్ని వార్తలు