భూముల కొనుగోలులో బ్రోకర్ల హవా

29 Jul, 2015 01:16 IST|Sakshi

జీలుగుమిల్లి : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు భూమికి భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున భూముల కొనుగోలును చేపట్టింది. దీన్ని ఆసరాగా చేసుకుని జీలుగుమిల్లి మండలంలో కొందరు బ్రోకర్లు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇప్పిస్తామంటూ గిరిజనేతర రైతులను మాయ చేస్తున్నారు. లక్షకు 20 శాతం కమీషన్‌గా ఇవ్వాలంటూ బేరసారాలు చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు కోసం భూములు పోగొట్టుకున్న రైతులకు ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా భూములు ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జీలుగుమిల్లి మండలంలో రైతుల వద్ద నుంచి వారి ఇష్టపూర్వకంగా అధికారులు భూములు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 1,600 ఎకరాల భూమిని సేకరించారు. దీనిని కొందరు బ్రోకర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.
 
  ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో మీ భూమిని చూపించి అధిక మొత్తం చెల్లించేలా చేస్తామని ఇందుకు 20 శాతం కమీషన్ ఇవ్వాలంటూ రైతులను ఆకర్షిస్తున్నారు. గిరిజనులకు, గిరిజనేతరులకు ఇక్కడ దశాబ్దాలుగా భూముల విషయంలో వైరం ఉంది. దీంతో గిరిజనేతరుల భూములపై కన్నేసిన బ్రోకర్లు వారికి రకరకాల ఆఫర్లు ఇస్తున్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో ఎకరానికి రూ.8 లక్షల వరకు వస్తుండడంతో రైతులు ఆశపడి బ్రోకర్ల మాయలో పడుతున్నారు. ఇదే అదనుగా బ్రోకర్లు రైతుల వద్ద నుంచి ముందుగా అడ్వాన్స్ సైతం తీసుకుంటుండడం గమనార్హం. బ్రోకర్లు స్థానిక అధికారులు, అధికార పార్టీల నేతలతో ఒప్పందాలు కుదుర్చుకుని వ్యవహారాలు చక్కబెడుతున్నట్టు సమాచారం. స్థానిక ప్రజాప్రతినిధులను మచ్చిక చేసుకుని తమ పనులు చేరుుంచుకుంటున్నట్టు
 తెలిసింది.  
 
 రెండు వేల ఎకరాల సేకరణ : మండలంలోని పది గ్రామాల్లో ఇప్పటికే భూములను అధికారులు సేకరించారు. మరో రెండు గ్రామాల పరిధిలో 2 వేల ఎకరాల భూములను సేకరించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ భూముల సేకరణలో రెవెన్యూ అధికారులు కూడా పైరవీలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నారుు. ఆర్‌ఆర్ ప్యాకేజీ, భూముల కొనుగోలులో ఎటువంటి బ్రోకర్లు లేకుండా, అక్రమాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు