నేటి నుంచి పప్పు ధాన్యాల కొనుగోళ్లు

1 Feb, 2020 04:33 IST|Sakshi

తొలి విడతగా 95 చోట్ల కందులు, శనగలు, పసుపు కొనుగోళ్లు

రెండో విడతలో అపరాలు, జొన్న, మొక్కజొన్న 

గిడ్డంగుల కొరత లేకుండా ఏర్పాట్లు

ఏపీ స్టేట్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ గోదాముల్లో నిల్వ

మరో లక్ష టన్నుల సామర్థ్యంగల గోదాములు నిర్మాణంలో

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో నేటి నుంచి పప్పు ధాన్యాల కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం మొత్తం 500 కొనుగోలు కేంద్రాలను అధికారులు గుర్తించారు. పది జిల్లాల్లో ఇంకా పంట చేతికి రానందున ముందస్తుగా అనంతపురం, కర్నూలు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లోని 95 కేంద్రాల్లో కందులు, శనగల కొనుగోళ్లు ప్రారంభిస్తున్నారు. రెండో విడత ఫిబ్రవరి 15న పసుపు, జొన్న, మొక్కజొన్న, అపరాల కొనుగోళ్లు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. కొనుగోళ్లు పురస్కరించుకుని రాష్ట్రంలో ఎక్కడా గోదాముల కొరత రాకుండా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ కొనుగోళ్ల ప్రారంభానికి అధికారులు ఎక్కడికక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తున్నారు. 

కేంద్ర మద్దతు ధర కంటే తక్కువగా..
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే తక్కువగా మార్కెట్‌లో కందులు, శనగపప్పు ధరలున్నాయి. కందులకు కనీస మద్దతు ధర క్వింటాకు రూ.5,800లు, శనగకు రూ.4,875, మినుములకు రూ.5,700, పెసలకు రూ.7,050లను కేంద్రం ప్రకటించింది. కానీ, కందులకు బహిరంగ మార్కెట్‌లో క్వింటాకు రూ.4,800 నుంచి రూ.5,000, శనగకు రూ.3,800ల ధర పలుకుతోంది. నాలుగైదు రోజుల నుంచి పంట ఎక్కువగా రావడంతో వ్యాపారులు రేటు ఇంకా తగ్గించి కొనేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ పరిస్థితులను ముందుగానే ఊహించిన మార్క్‌ఫెడ్‌.. జిల్లాల్లోని రైతులను అప్రమత్తం చేస్తోంది. పంటను కేంద్రానికి తీసుకువచ్చే ముందు ఈ–క్రాప్‌లో నమోదు చేసుకుని ఉండాలని, లేదా క్షేత్రస్థాయిలోని అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకుని రావాలని సూచిస్తోంది. పంట నమూనాలను కొనుగోలు కేంద్రంలోని అధికారులకు ముందుగా చూపించి, ఆ తర్వాతే పంటను తీసుకురావాలని చెబుతున్నారు. అలాగే, వ్యవసాయ శాఖ అంచనా మేరకు కందుల దిగుబడి లక్ష నుంచి లక్షా పాతిక వేల టన్నుల వరకు ఉండొచ్చు. అయితే, రాష్ట్రానికి 23,500 మెట్రిక్‌ టన్నుల సేకరణకే కేంద్రం అనుమతించింది. దీంతో 70 వేల మెట్రిక్‌ టన్నుల సేకరణకు అనుమతివ్వాలని మార్క్‌ఫెడ్‌ అధికారులు కోరారు.

గోదాముల కొరత లేకుండా చర్యలు
గత ఏడాది పంటల సేకరణ సమయంలో గోదాముల కొరత ఏర్పడింది. దీంతో రాయలసీమలో కొనుగోలు చేసిన పంటను కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని గోదాముల్లో నిల్వచేశారు. ఫలితంగా ప్రభుత్వంపై రవాణా ఖర్చుల భారం పడింది. ఈ పరిస్థితులను పునరావృతం కాకుండా ప్రభుత్వం ఈసారి శాశ్వత కొనుగోలు కేంద్రాలను ప్రకటించింది. అదేవిధంగా ఏపీ స్టేట్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ నిర్మించిన గోదాముల్లోనే పంటను నిల్వ చేసేందుకు ఏర్పాట్లుచేసింది. ఆ కార్పొరేషన్‌కు 6.76 లక్షల మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములున్నాయి. కొంతవరకు సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌కు చెందిన బియ్యాన్ని నిల్వచేస్తున్నా, కొనుగోలు చేయనున్న మిగిలిన పంటలను అక్కడ నిల్వచేయనున్నారు. అలాగే, మరో లక్ష మెట్రిక్‌ టన్నుల పంటలకు సరిపడా గోదాముల నిర్మాణాలు జరుగుతున్నాయి. 

మరిన్ని వార్తలు