పుష్కర స్నానాలు@ 66.50 లక్షలు

20 Jul, 2015 03:24 IST|Sakshi

సాక్షి, కొవ్వూరు : గడచిన ఆరు రోజుల్లో జిల్లాలోని 97 పుష్కర ఘాట్లలో పుష్కర పుణ్యస్నానాలు ఆచరించిన వారి సంఖ్య 66.50 లక్షలుగా అధికార యంత్రాంగం గణించింది. ఇదిలావుండగా ఆదివారం ఒక్కరోజే సాయంత్రం 6 గంటల వరకు 17,46,217 మంది పుణ్యస్నానాలు ఆచరించారు. కొవ్వూరు డివిజన్ పరిధిలోని ఘాట్లలో 9,36,292 మంది, నరసాపురం డివిజన్ పరిధిలోని మూడు మండలాల్లో 4,59,925 మంది, జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని ఘాట్లలో 3.50 లక్షల మంది స్నానాలు ఆచరించారు. అత్యధికంగా గోష్పాద క్షేత్రంలో 2.72లక్షల మంది పుణ్యస్నానాలు చేశారు. గోష్పాద క్షేత్రం లోని గాయత్రి ధ్యానమందిరంలో కంచి ఉపపీఠాధిపతి విజయేంద్ర సరస్వతిస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 ట్రాఫిక్ నియంత్రణకు కసరత్తు
 ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో మొబైల్, స్టేషనరీ టీమ్‌లను ఏర్పాటు చేసి జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిరంతరం పర్యవేక్షించే ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్, రాయలసీమ జిల్లాల నుంచి వచ్చే వాహనాలను గుండుగొలను, నల్లజర్ల, కొయ్యలగూడెం, దేవరపల్లి మీదుగా వివిధ ఘాట్‌లకు ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. కొవ్వూరులో ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి ముందస్తుగానే కసరత్తు చేసి తాళ్లపూడి జంక్షన్ సమీపంలో ట్రాఫిక్‌ను  పోలవరం, పట్టిసీమకు మళ్లించారు. దాదాపు 50వేల మంది యాత్రికులను ఇతర ఘాట్‌లకు దారి మళ్లించారు. కలెక్టర్ కాటంనేని భాస్కర్ జిల్లాలో నిరంతర నిఘా కొనసాగించడానికి 142 సీసీ కెమెరాలు , 25 మోనిటరింగ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. కీలక ప్రాంతాల్లో 16 వాచ్ టవర్లను ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు