టీచర్‌ పాత్రలో డిప్యూటీ సీఎం

23 Sep, 2019 11:34 IST|Sakshi
టీచర్‌ పాత్రలో ఒదిగిన డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి

అమృతభూమి సినిమాలో నటించిన డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి

 ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ సినిమా చిత్రీకరణ

గొరడలో షూడింగ్‌ సందడి..

అధికారి పాత్రలో కలెక్టర్‌..

సాక్షి, గుమ్మలక్ష్మీపురం (విజయనగరం): ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యం తెలిపేలా తెరకెక్కిస్తున్న ‘అమృత భూమి’ సినిమాలో టీచర్‌ పాత్రలో డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖామంత్రి పాముల పుష్పశ్రీవాణి, అధికారి పాత్రలో కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ నటించారు. మండలంలోని లోవముఠా ప్రాంతం గొరడ గ్రామంలో నిర్వహించిన సినిమా చిత్రీకరణలో ఆమె పాల్గొన్నారు. గొరడ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయురాలిగా డిప్యూటీ సీఎంపై సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ సందర్భంగా పుష్పశ్రీవాణి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా సినిమా నిర్మించడం ఆనందదాయకమన్నారు. నటుడు రాజాప్రసాద్‌ బాబు మాట్లాడుతూ రోజు రోజుకీ అటవీప్రాంతం అంతరించి పోతోందని, తినే తిండి గింజల నుంచి కట్టుకునే బట్ట వరకు అంతా రసాయనాలతో నిండిపోతుందని చెప్పారు. రైతులకు ప్రకృతి వ్యవసాయం పట్ల చైతన్యపర్చేందుకు ఈ చిత్రాన్ని రూపొం దిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జానపద కళాకారుడు వండపండు, జట్టు వ్యవస్థాపకులు డి.పారినాయుడు పాల్గొన్నారు.

తోటపల్లిలో సినిమా సందడి
గరుగుబిల్లి: ప్రకృతి వ్యవసాయంపై రైతులను చైతన్యవంతం చేస్తూ తెరకెక్కిస్తున్న అమృతభూమి సినిమాలో అధికారి పాత్రలో కలెక్టర్‌ డా.హరిజవహర్‌లాల్‌ నటించారు. మండలంలోని తోటపల్లిలోని ప్రకృతి ఆదిదేవోభవ ప్రాంగణంలో పలు సన్నివేశాలను ఆదివారం చిత్రీకరించారు. ఏపీ రైతు సాధికార సంస్థ, అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ సహకారంతో జట్టుటస్టీ డి.పారినాయుడు పర్యవేక్షణలో సినిమా నిర్మాణం జరుగుతోంది. సినీ రచయిత వంగపండు ప్రసాదరావు ప్రకృతి వ్యవసాయం ఇతివృత్తంగా ఈ కథను రచించారు. షూటింగ్‌లో కలెక్టర్‌ పాల్గొనడంతో చూసేందుకు పరిసర గ్రామాల ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం సేంద్రియ ఎరువులను వినియోగించి ఆరోగ్యకరమైన పంటల ఉత్పత్తికి ప్రణాళిక రూపొందించిందన్నారు. ఈ సినిమా ద్వారా ప్రజల్లో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో సీనియర్‌ నటుడు ప్రసాద్‌బాబు, టీవీ ఆర్టిస్ట్‌ దయబాబు, కెమెరామెన్‌ మురళి, ఆర్ట్‌ డైరెక్టర్‌ శివ, సహదర్శకుడు రౌతు వాసుదేవరావుతో పాటు నటీనటులు ప్రసాద్‌బాబు, లక్ష్మి, స్వప్న, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు