‘ప్రపంచాన్ని జయించే ఒకే ఆయుధం విద్య’

24 Feb, 2020 15:47 IST|Sakshi

సాక్షి, విజయనగరం: అమ్మఒడి, నాడు-నేడు కార్యక్రమాల ద్వారా విద్యా వ్యవస్థలో సంచలన మార్పులు వస్తున్నాయని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ అన్నారు. సోమవారం ‘జగనన్న వసతి దీవెన’ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టి ఆరునెలల్లో ఆంధ్రప్రదేశ్‌ను నాలుగో స్థానంలో నిలిపారని ఆయన అన్నారు. భవిష్యత్‌లో దేశ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం సాధిస్తుందని విశ్వరూప్‌పేర్కొన్నారు. (నిరుపేదల జీవితాలలో మార్పు రావాలి..)

ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ  మంత్రి పాముల పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాలు, ఆలోచనలు, పరిపాలనా తీరు చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. నెల్సన్ మండేలా చెప్పినట్టు ప్రపంచాన్ని జయించడానికి ఒకే ఆయుధం విద్య అని ఆమె అన్నారు. అటవంటి విద్యను సాధించేందుకు ఎదురయ్యే అడ్డంకులు తొలగించే విధంగా, విద్యపై ఆసక్తి కలిగేలా విద్య వ్యవస్థలో సీఎం వైఎస్‌ జగన్‌ మార్పులు తీసుకు వస్తున్నారని ఆమె తెలిపారు. సీఎం జగన్‌ పాదయాత్రలో విన్నారని.. ఈరోజు ప్రజలకు అండగా ఉన్నారని  ఆమె గుర్తు చేశారు. అనేక అవరోధాలు దాటి ప్రతి పేద విద్యార్థి ఉన్నత స్థాయికి చేరే విధంగా ప్రభుత్వం పథకాలను తీసుకొస్తుందన్నారు. (జగనన్న వసతి దీవెన: ప్రసంగంతో అదరగొట్టిన అభిమన్యు!)

జిల్లాలో ఉపాధి అవకాశాల కోసం వలస వెళ్లినవారు, అక్కడ ప్రాణాపాయ స్థితుల్లో పనులు చేసుకుంటూ ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉందన్నారు. ఆ పరిస్థితులు అధిగమించేలా విశాఖ పరిపాలన రాజధాని రాబోతుందని పుష్పశ్రీవాణి అన్నారు. సీఎం జగన్ దేశంలోనే ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి అని ఆమె కొనియాడారు. గిరిజన మహిళగా నేల మీద కూర్చుని విద్యను అభ్యసించి, ఉపాధ్యాయునిగా ఉన్న తనకు గొప్ప గౌరవం ఇచ్చిన సీఎం జగన్‌ అభిమానాన్ని మరచిపోలేనని ఆమె పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకర నారాయణ మాట్లాడుతూ.. గతంలో చంద్రబబాబును ఇచ్చిన ప్రోత్సాహకాల కంటే ఎక్కువగా సీఎం వైఎస్‌ జగన్ ఇస్తున్నారని గుర్తు చేశారు. అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబు తన మంది మార్భాలన్ని కాపాపడుకునేందుకు కులం రంగు పూస్తున్నారని మండిపడ్డారు. తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని  శంకర్‌ నారాయణ అన్నారు.

>
మరిన్ని వార్తలు