‘పుట్టగుంట’ కేసు దర్యాప్తు వేగవంతం

26 Aug, 2014 03:18 IST|Sakshi

హనుమాన్‌జంక్షన్ : హనుమాన్‌జంక్షన్‌కు చెందిన పారిశ్రామిక వేత్త పుట్టగుంట సతీష్‌కుమార్‌కు మావోయిస్ట్ పార్టీ నేతల పేరుతో వస్తున్న బెదిరింపు ఫోన్‌కాల్స్‌పై పోలీసుల దర్యాప్తు ఊపందుకుంది. మావోయిస్టు నేతగా చెప్పుకుంటున్న వ్యక్తి మాట్లాడుతున్న ఫోన్ నంబర్, అతను ఇచ్చిన బ్యాంకు అకౌంట్లపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.

కాల్‌డేటాను సేకరించిన పోలీసులకు వరంగల్, కరీంనగర్ పరిసర ప్రాంతాల నుంచి ఫోన్లు వస్తున్నట్లు నిర్ధారణ కావటంతో ఇప్పటికే ఒక టీంను అక్కడకు పంపారు. ఈ కేసుపై అధికార పార్టీ నేతల నుంచి పోలీసులకు ఒత్తిడి పెరగటంతో దర్యాప్తు వేగవంతం చేశారు. పార్టీ ఫ్లీనరీ కోసం విరాళం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మావోయిస్టు పార్టీ నేతల నుంచి  నాలుగైదు రోజులుగా వస్తున్న బెదిరింపు ఫోన్‌కాల్స్ పరంపర సోమవారం కూడా కొనసాగింది.  
 
ఫలించని పోలీసు వ్యూహం...
 
మావోయిస్టు పార్టీ నేత గణపతి పేరుతో ఫోన్‌కాల్స్ చేస్తున్న వ్యక్తి డబ్బులు జమ చేసేందుకు పుట్టగుంట సతీష్‌కుమార్‌కు రెండు బ్యాంకు అకౌంట్ నంబర్లు ఇచ్చాడు. వీటి ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు సోమవారం పోలీసులు వేసిన వ్యూహం విఫలమైంది. వరంగల్‌కు 50 కి.మీ దూరంలో జమ్మిగుంట పట్టణానికి చెందిన ఆంధ్రాబ్యాంకు అకౌంట్ నంబర్‌ను మావోయిస్టులు ఇవ్వటంతో దానిపై నిఘా పెట్టారు.

ఆ బ్యాంకు బ్రాంచి మేనేజర్ కాశీ విశ్వేశ్వరరెడ్డి, జమ్మిగుంట సీఐతో హనుమాన్‌జంక్షన్ సీఐ వై.వి.రమణ, ఎస్.ఐ నాగేంద్రకుమార్ మాట్లాడారు. మావోయిస్టు బెదిరింపు ఫోన్‌కాల్స్ కేసు వివరాలను పూర్తిగా వారికి వివరించి నిందితులను రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకునేందుకు ప్రణాళిక రచించారు. మావోయిస్టులు తెలిపిన బ్యాంకు అకౌంట్ జమ్మిగుంటకు సమీపంలోకి కొత్తపల్లి గ్రామానికి చెందిన నేతి నర్సయ్య పేరిట ఉందని విచారణలో వెల్లడైంది.

ఏటీయం సదుపాయం లేకపోవటంతో ఖచ్చితంగా బ్యాంకుకు వచ్చి నగదు డ్రా చేసుకుని వెళ్లాల్సిందేనని మేనేజర్ వెల్లడించారు. దీంతో వ్యూహం ప్రకారం ముందస్తుగా బ్యాంకు వద్ద జమ్మిగుంట పోలీసులను నిఘా పెట్టించి మావోయిస్టు నేతకు పుట్టగుంటతో ఆంధ్రాబ్యాంకు అకౌంట్‌లో తొలి విడతగా రూ.20 వేలు నగదు జమ చేసినట్లుగా ఫోన్ చేయించారు. ఈ నగదును డ్రా చేసుకునేందుకు బ్యాంకు వద్దకు వస్తే నిందితుడు తమ చేతికి చిక్కినట్లేననే  పోలీసులు భావించారు.

కానీ బ్యాంకు వద్ద జమ్మిగుంట పోలీసులు రోజంతా పడిగాపులు పడినా ఆ అకౌంట్ నుంచి నగదు డ్రా చేసేందుకు ఎవరూ రాకపోవటంతో నిరాశ చెందారు. సదరు బ్యాంకులో ఖాతా తెరిచేందుకు తెల్పిన ఆడ్రస్సు, పాస్‌పోర్టు సైజు ఫొటో ఆధారంగా చేసుకుని నిందితుని ఆచూకీకోసం ఆరా తీసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఖాతాదారుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తే కేసు దర్యాప్తు ఓ కొలిక్కి వస్తుందని హనుమాన్‌జంక్షన్ సీఐ వై.వి.రమణ తెలిపారు.
 

మరిన్ని వార్తలు