వైద్యుల సూచన మేరకే మందులు వాడాలి

25 Mar, 2020 04:45 IST|Sakshi

కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి

ముఖ్యమంత్రి అదనపు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పీవీ రమేష్‌

సాక్షి, అమరావతి: వైద్యులను సంప్రదించకుండా కరోనా వ్యాధికి ఎలాంటి మందులు వాడకూడదని ముఖ్యమంత్రి అదనపు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పీవీ రమేష్‌ చెప్పారు. ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి డాక్టర్‌ ఎం.హరికృష్ణతో కలిసి సచివాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కరోనా కట్టడి కోసం పనిచేస్తున్న సిబ్బందికి ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలపమని చెప్పారన్నారు. ఇంకా ఏమన్నారంటే..

- రాష్ట్రంలో ఇప్పటివరకు కేవలం 7 పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదయ్యాయి. 
- విదేశాల నుంచి రాష్ట్రానికి ఇప్పటివరకు 13,894 మంది వచ్చారు. వారిలో 11,421 మందికి పరీక్షలు నిర్వహించాం. వారిలో 2,473 మందికి పరీక్షల్లో ఎటువంటి సమస్యలు లేకపోవడంతో ఇంటివద్దనే ఉంటున్నారు. 53 మంది హాస్పిటల్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు.
- రాష్ట్రంలో 800 వెంటిలేటర్స్‌ ఉన్నాయి. మరో 200 వెంటిలేటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 
- సాధారణ వ్యక్తులు మాస్క్‌లు వాడాల్సిన అవసరం లేదు. విదేశాల నుంచి వచ్చిన వారు, వారికి దగ్గరగా ఉండేవారు, సంబంధీకులు మాత్రమే మాస్క్‌లు వాడితే సరిపోతుంది. 
- రిటైరైన వైద్యులు, నర్సులను గుర్తిస్తున్నాం. వారి సేవలను వైరస్‌ నియంత్రణ చర్యల్లో ఉపయోగించుకుంటాం.
- నిత్యావసర సరుకులను ఎక్కువ ధరకు అమ్ముతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవు.
- నిత్యావసర సరుకులు తోపుడు బండ్ల ద్వారా రోజంతా అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారన్నారు. 

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ కొందరికే..
వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టీకరణ
హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను వినియోగిస్తే కరోనా రాదంటూ కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాల్లో వాస్తవం లేదని వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. సాధారణ వ్యక్తులెవ్వరూ ఈ మందును వినియోగించరాదని పేర్కొంది. అలా వినియోగిస్తే దుష్పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించింది. 
- కరోనా వైరస్‌ సోకిన వారికి మాత్రమే ఈ మందును వాడాలని అఖిల భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) స్పష్టం చేసింది. ఇది కూడా ప్రత్యామ్నాయంలో భాగమే. 
- కరోనా సోకిన రోగులకు, సేవలందిస్తున్న వైద్యులకు, సిబ్బందికి ముందు జాగ్రత్తగా మాత్రమే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వినియోగిస్తున్నారు. ఇది పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో జరుగుతోంది.
- కరోనా రాకుండా ఉండాలంటే హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ వాడితే సరిపోతుందన్న భావనలోకి ప్రజలెవ్వరూ వెళ్లకూడదు. 
- కరోనా వైరస్‌ సోకిన వారికి, వారితో ఉన్నందువల్ల వ్యాధి లక్షణాలు కనిపిస్తున్న వారికి మాత్రమే పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో ఈ మందు ఇస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలి. 

మరిన్ని వార్తలు