సీఎం జగన్‌ను కలిసిన పీవీ సింధు

13 Sep, 2019 11:46 IST|Sakshi

సాక్షి, అమరావతి: బ్యాడ్మింటన్‌ ప్రపంచ చాంపియన్‌ తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధు శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసింది. బ్యాడ్మింటన్‌ ప్రపంచ చాంపియన్‌లో తాను సాధించిన బంగారు పతకాన్ని సీఎం జగన్‌కు ఆమె చూపించింది. ఈ సందర్భంగా పీవీ సింధును గౌరవ ముఖ్యమంత్రి ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సింధు వెంట ఆమె తల్లిదండ్రులతో పాటు మంత్రి అవంతి శ్రీనివాస్, శాప్ అధికారులు ఉన్నారు. ఇటీవల జరిగిన ప్రపంచ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో పీవీ సింధు స్వర్ణం నెగ్గి సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

ఐదు ఎకరాలు ఇస్తామన్నారు: సింధు
సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశానని, బ్యాడ్మింటన్‌ ప్రపంచ చాంపియన్‌గా నిలిచినందుకు తనకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారని పీవీ సింధు విలే​కరులతో చెప్పింది. అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని, వైజాగ్‌లో బ్యాడ్మింటన్‌ అకాడమికి ఐదు ఎకరాలు కేటాయిస్తామని సీఎం హామీయిచ్చినట్టు వెల్లడించింది. పద్మభూషణ్ అవార్డుకు తన పేరు సిపార్సు చేయడం సంతోషం వ్యక్తం చేసింది. కాగా, రాష్ట్ర ప్రాధికార క్రీడా సంస్థ ఆధ్వరంలో విజయవాడలోని తుమ్మల కళాక్షేత్రంలో ఈ రోజు మధ్యాహ్నం పీవీ సింధు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అథితిగా హాజరుకానున్నారు. (చదవండి: ఓ ఖాళీ ఉంచా అంటున్న సింధు)

మరిన్ని వార్తలు