ఆకాంక్షలకు అనుగుణంగా ఎదగనివ్వండి

18 Feb, 2019 07:24 IST|Sakshi
మాట్లాడుతున్న బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి, రాజీవ్‌ ఖేల్‌రత్న పి.వి.సింధు

అప్పుడే చిన్నారులు వారికి ఇష్టమైన రంగాల్లో రాణిస్తారు

నా తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఒలింపిక్‌ స్థాయికి వెళ్లాను

బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి.సింధు

విశాఖపట్నం, అనకాపల్లి: ‘మీ పిల్లల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రోత్సహించండి. వారు ఇష్టపడిన రంగంలో ఎదిగేందుకు అవకాశం కల్పించండి’ అని బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి రాజీవ్‌ ఖేల్‌రత్న అవార్డు గ్రహీత పి.వి.సింధు అన్నారు. అనకాపల్లి పట్టణంలోని రావుగోపాలరావు కళాక్షేత్రంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనకాపల్లి వచ్చినందుకు తనకు చాలా ఆనందంగా ఉందని, ఇక్కడి చిన్నారుల నృత్యాలు చూసి తన చిన్ననాటి రోజులు గుర్తు వచ్చాయని అన్నారు.

విద్యార్థులు అటు క్రీడలను, ఇటు చదువును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎదగాలని ఆకాంక్షించారు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహం వలనే తాను ఈ స్థాయికి ఎదిగానని పేర్కొన్నారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మాట్లాడుతూ మన తెలుగుతేజం పి.వి.సింధును స్ఫూర్తిగా తీసుకొని అందరూ క్రీడల్లో రాణించాలన్నారు. ఈ సందర్భంగా సింధును  ఘనంగా సత్కరించారు.  అర్జున అవార్డు గ్రహీత, సింధు తండ్రి పి.వి.రమణను కూడా సత్కరించారు. కార్యక్రమంలో డీఈవో లింగేశ్వరరెడ్డి, డైట్‌ కళాశాల కరస్పాండెంట్‌ దాడి రత్నాకర్, వినియోగదారుల హక్కుల సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు వికాష్‌పాండే, వినియోగదారుల హక్కుల సంస్థ జిల్లా అధ్యక్షుడు డి.చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు