అలజడి సృష్టించిన సర్పరాజం

16 May, 2019 11:32 IST|Sakshi
స్నేక్‌ క్యాచర్‌ కిరణ్‌కు చిక్కినా పడగ విప్పి బుసకొడుతున్న నాగుపాము

ఎస్వీకే నగర్‌లో నాగుపాము కలకలం

విశాఖపట్నం,ఎన్‌ఏడీ జంక్షన్‌(విశాఖ పశ్చిమ): ఎండాకాలం ధాటికి పుట్ట నుంచి బయిటపడి జనావాసాల్లోకి దూరిందేమో.. ఓ భారీ సర్పం అలజడి సృష్టించింది. ఎన్‌ఏడీ జంక్షన్‌ చేరువలోని ఎస్వీకే నగర్‌లో ఓ పెద్ద నాగుపాము కలకలం రేపింది. ఇక్కడ ఒక పూరింట్లో దూరి అక్కడివారిని భయభ్రాంతులకు గురిచేసింది. ఇంట్లో ఒక మూలకు చేరి ఉండిపోయిన ఈ నాగుపామును ఇంట్లో వారు గుర్తించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ 42వ వార్డు అ«ధ్యక్షుడు జియ్యాని శ్రీధర్‌కు సమాచారమిచ్చారు.

ఆయన మల్కాపురానికి చెందిన స్నేక్‌ క్యాచర్‌ కిరణ్‌కు కబురు పెట్టారు. సర్పం ఉన్న ఇంటి వద్దకు చేరుకున్న కిరణ్, తన వద్ద ఉన్న పరికరాల సాయంతో సర్పాన్ని చాకచక్యంగా పట్టుకుని సంచిలో బంధించారు. సుమారు పది అడుగుల  పొడవున్న ఈ సర్పం చాలా విషపూరితమైనదని, జనావా సాలకు దూరంగా అడవిలో దీనిని విడిచిపెడతామని తెలిపారు. పాము చిక్కగానే స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.  దీనిని ఫోటోలు తీసేందుకు ఎగబడ్డారు.

మరిన్ని వార్తలు