నాణ్యమైన విద్యకు ప్రణాళిక

21 Jan, 2014 01:44 IST|Sakshi
నాణ్యమైన విద్యకు ప్రణాళిక
  • కృష్ణా వర్సిటీ వీసీ వెల్లడి
  •  నాలుగు నెలల పాటు సెమినార్లు, వర్క్‌షాపుల నిర్వహణ
  •  
    మచిలీపట్నం, న్యూస్‌లైన్ : కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో నాణ్యమైన విద్యనందించేందుకు ప్రణాళిక రూపొందించామని వర్సిటీ వీసీ వున్నం వెంకయ్య తెలిపారు. స్థానిక తన చాంబర్‌లో సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. వర్సిటీ పరిధిలోని 144 కళాశాలలు, వర్సిటీ క్యాంపస్, నూజివీడులోని పీజీ సెంటర్ ద్వారా నాణ్యమైన విద్యనందించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు.

    ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 23, 24 తేదీల్లో విజయవాడలోని కేవీఎస్‌ఆర్ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సెన్సైస్‌లో రెండురోజుల పాటు ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహిస్తున్నామన్నారు. కృష్ణా వర్సిటీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏపీఎస్‌సీహెచ్‌ఈ) సంయుక్త ఆధ్వర్యంలో ‘ఎసెస్‌మెంట్ అండ్ ఎక్రిడిటేషన్ ఏ టూల్ టు ఎన్‌హేన్స్ క్వాలిటీ అండ్ ఎక్సలెన్స్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్’ అనే అంశంపై ఈ వర్క్‌షాప్ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి కళాశాలలోనూ నాణ్యతతో కూడిన విద్యనందించటం కళాశాలలో ఉన్న సౌకర్యాలు గుర్తించటం, అటానమస్ కళాశాలలుగా గుర్తింపు ఎలా పొందాలి తదితర అంశాలపై విద్యారంగంలో నిష్ణాతులు ప్రసంగిస్తారని చెప్పారు.
     
    జనవరి నుంచి ఏప్రిల్ వరకు కార్యక్రమాలు...
     
    ఈ నెల 21, 22 తేదీల్లో విజయవాడలోని ఎస్‌డీఎంఎస్‌ఎం కళాశాలలో ‘ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ ఇండియన్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ 21 సెంచరీ’ అనే అంశంపై కృష్ణా యూనివర్సిటీ అనే అంశంపై రెండు రోజుల పాటు సెమినార్ నిర్వహించనున్నట్లు వీసీ చెప్పారు. విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాలలో కృష్ణా వర్సిటీ బయోటెక్నాలజీ విభాగంలో ‘కాన్సెప్ట్‌వల్ అడ్వాన్సెస్ ఆన్ ఇంపాక్ట్ ఆఫ్ ప్లాంట్ డెలివర్డ్ డ్రగ్స్ ఆన్ హ్యూమన్ డిసీజెస్’ అనే అంశంపై జాతీయస్థాయి సెమినార్ ఈ నెల 21, 22 తేదీల్లో జరుగుతుందన్నారు.

    మార్చి 27, 28 తేదీల్లో కృష్ణా యూనివర్సిటీ కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో క్యాంపస్‌లో ప్రత్యేక సెమినార్ జరుగుతుందన్నారు. ఏప్రిల్‌లో కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో జాతీయస్థాయి సెమినార్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జాతీయస్థాయి సెమినార్‌ను నిర్వహించేందుకు యూనివర్సిటీ క్యాంపస్‌లో నిర్ణయించామన్నారు.

    తెలుగు విభాగం ఆధ్వర్యంలో ‘కృష్ణాజిల్లాలో జానపద కళారీతులు - ఉపన్యాసపూర్వక ప్రదర్శన’ ఉంటుందని చెప్పారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగం ఆధ్వర్యంలో ‘ప్రసార మాధ్యమాల్లో తెలుగు’ అనే అంశంపై రెండు రోజుల పాటు సదస్సు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర అధికారిక భాషా సంఘం ఆధ్వర్యంలో మార్చి మూడో వారంలో వర్సిటీ క్యాంపస్‌లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.
     
    ఈ విద్యాసంవత్సరంలో వర్సిటీ కొత్త కోర్సులు...
     
    2014-15 విద్యాసంవత్సరం నుంచి యూనివర్సిటీ పరిధిలో నూతన కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు వీసీ తెలిపారు. ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎంబీఏ ఇన్ హాస్పిటాలిటీ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్, ఎమ్మెస్సీ ఇన్ ఫిజికల్ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ ఇన్ ఇనార్గిన్ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ ఇన్ ఆప్టో ఎలక్ట్రానిక్స్, షార్ట్ టర్మ్ కోర్స్ ఇన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ స్కిల్స్, సర్టిఫికెట్/డిప్లమో ప్రోగ్రాం ఇన్ యోగా అనే కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఎమ్మెస్సీ ఇన్ ఆప్టో ఎలక్ట్రానిక్స్ కోర్సును విజయవంతంగా నడిపేందుకు మచిలీపట్నంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీతో టై అప్ అయినట్లు వివరించారు. ఈ కోర్సు ప్రవేశపెట్టేందుకు సోమవారమే బెల్ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడినట్లు చెప్పారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డి.సూర్యచంద్రరావు, పీఆర్వో సీఎం వినయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు