నాణ్యమైన సరకులు సరఫరా చేయాలి

6 Nov, 2013 02:55 IST|Sakshi

 పాడేరు, న్యూస్‌లైన్: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లకు నాణ్యమైన నిత్యావసర సరకులు సరఫరా చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.వినయ్‌చంద్ జీసీసీ అధికారులు, వ్యాపారులను ఆదేశించారు. హాస్టళ్లలో వంట నూనెలు, పప్పులు, కోడి గుడ్లు, కాస్మోటిక్స్, ఇతర నిత్యావసర సరకుల సరఫరాకు సంబంధించి ఐటీడీఏ కార్యాలయంలో మంగళవారం టెండర్ల కార్యక్రమం నిర్వహించారు. బకాయిలు పేరుకుపోవడంతో కొంతమంది వ్యాపారులు టెండర్లకు దూరంగా ఉన్నప్పటికీ తుని, అనకాపల్లి, రాజమండ్రి ప్రాంతాలకు చెందిన కొత్త వ్యాపారులు ఈ టెండర్‌లో పాల్గొన్నారు. 439 క్వింటాళ్ల కందిపప్పు, 306 క్వింటాళ్ల శనగపప్పు, 185 క్వింటాళ్ల పెసరపప్పు, 534 క్వింటాళ్ల బఠాణి, 188 క్వింటాళ్ల పంచదార, 59,480 లీటర్ల వంటనూనె తదితర నిత్యావసర సరకుల సరఫరాకు టెండర్లు నిర్వహించారు. మొత్తం 29 రకాల నిత్యావసర సరకులకు సంబంధించి వ్యాపారులు కోడ్ చేసిన ధరల వివరాలను, సరుకుల శాంపిల్స్ నాణ్యతను పరిశీలించారు.
 
  కందిపప్పు కిలో రూ.57, మినపపప్పు రూ.54, శనగపప్పు రూ.45, పెసరపప్పు రూ.77, బఠాణి రూ.37, పామాయిల్ రూ.65.50 ధరతో టెండర్లు ఖ రారు చేశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ టెండర్‌లో చూపించిన శాంపిల్స్ ప్రకారమే నాణ్యమైన నిత్యావసర సరకులను సకాలంలో సరఫరా చేయాలని ఆదేశించారు. సరుకుల్లో నాణ్యత లోపిస్తే సంబంధిత వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సరఫరా చేసిన సరకులకు బిల్లుల చెల్లింపుల విషయంలో ఎలాంటి జాప్యం ఉండదని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు బి.మల్లికార్జునరెడ్డి, జీసీసీ డివిజనల్ మేనేజర్ ప్రతాప్‌రెడ్డి, బ్రాంచి మేనేజర్లు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా