కుటుంబ పరువు కోత

18 Jun, 2019 06:57 IST|Sakshi
చిన్నపాటి వర్షానికే కోతకు గురైన రోడ్లు

రోడ్డు నిర్మాణంలో నాణ్యత డొల్ల 

రెండు కిలోమీటర్ల రోడ్డు రెండు రోజుల్లోనే.. 

ఎన్నికల వేళ హడావుడి పనులు 

చిన్నపాటి వర్షానికే కొట్టుకుపోయిన మట్టి రోడ్డు 

తారు లేచిపోయి మట్టితేలిన వైనం 

పెసరకుంట రోడ్డుకు నెర్రెలు 

రాప్తాడు నియోజకవర్గంలో మాజీ మంత్రి పరిటాల సునీత కుటుంబ దోపిడీ తవ్వేకొద్దీ ఆశ్చర్యం కలిగిస్తోంది. చిన్నాన్న నారాయణ చౌదరి, తమ్ముళ్లు ధర్మవరపు మురళి, ధర్మవరపు బాలాజీ.. సమీప బంధువులు రామ్మూర్తి నాయుడు, నెట్టెం వెంకటేష్, మహేంద్ర సాగించిన అక్రమాల బాగోతం ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. కనీసం ఆ పార్టీ నేతలను కూడా ఎదగనీయకుండా.. ప్రజలకూ మేలు చేయకపోగా గత ఐదేళ్లలో ఇబ్బడిముబ్బడిగా ఆస్తులు కూడబెట్టిన తీరు ఆ పార్టీలోనే తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే పరిటాల కోట బద్దలైంది. ఇదే సమయంలో అవినీతి పుట్ట పగులుతోంది. 

సాక్షి, రాప్తాడు : టీడీపీ ప్రభుత్వ హయాంలో అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ ఆ పార్టీ నేతలు సొమ్ము చేసుకున్నారు. ఐదేళ్లలో కనీసం ప్రజలను కలిసి, వారి బాగోగులు తెలుసుకున్న పాపాన పోలేదు. పైగా జన్మభూమి కమిటీల పెత్తనం సరేసరి. ప్రజల సొమ్మును యథేచ్ఛగా దోచుకున్నారు. నాయకుల అండదండలతో కాంట్రాక్టర్లు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఎవరికి ముట్టజెప్పాల్సింది వారి చేతిలో పెట్టి.. నాసిరకం పనులతో మమ అనిపించారు. రామగిరి మండలంలో నూతనంగా నిర్మించిన ఎంపీడీఓ కార్యాలయ భవనం నాలుగు నెలలు కూడా పూర్తి కాకుండానే చిన్నపాటి వర్షానికి గదులన్నీ కారి ముద్దయిన విషయం తెలిసిందే. ఈ పని చేసింది మరెవరో కాదు.. మాజీ మంత్రి పరిటాల సునీత చిన్నాన్న ఎల్‌.నారాయణ చౌదరి. ఏదో ఒక పనిలే అనుకుంటే.. తాజాగా ఇంకో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నాలుగైదు రోజుల క్రితం కురిసిన వర్షానికి మండలంలోని గొల్లపల్లి నుంచి పెసరకుంట గ్రామానికి వేసిన రోడ్డుకు ఇరుపైపులా మట్టి రోడ్డు పూర్తిగా కోసుకుపోయింది. చాలా చోట్ల రోడ్డు కూడా తారు లేచిపోయింది. ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే పెసరకుంట గ్రామస్తులు నరకం చూస్తున్నారు. సొంత నియోజకవర్గంలో, కుటుంబ సభ్యులు చేసిన పనులు ప్రజలకు పది కాలాల పాటు సేవలందించాల్సింది పోయి.. పట్టుమని పది రోజులు కూడా నిలవని పరిస్థితి.
 
తారు పోసి.. మాయ చేసి 
ఐదేళ్ల పాటు ప్రజలను విస్మరించిన పరిటాల కుటుంబం ఎన్నికల వేళ గిమ్మిక్కులు చేసింది. పంచాయతీరాజ్‌ ఆధ్వర్యంలో ట్రైబల్‌ సబ్‌ప్లాన్‌ నిధులు రూ.1.20కోట్లతో మండలంలోని గొల్లపల్లి గ్రామ సమీపంలోని 44వ జాతీయ రహదారి నుంచి పెసరకుంట వరకు తారు రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ పనులను మాజీ మంత్రి పరిటాల సునీత సమీప బంధువు, టీడీపీ నేత ఎల్‌.నారాయణప్పకు చెందిన శ్రీకృష్ణదేవరాయ కన్‌స్ట్రక్షన్స్‌(ఎస్‌కేసీ) దక్కించుకుంది. ఎల్‌.నారాయణప్ప నుంచి మరూరుకు చెందిన టీడీపీ నేత తక్కెల్ల చంద్రబాబు నాయుడు సబ్‌ కాంట్రాక్టు తీసుకున్నాడు. అయితే ఇతను కూడా డమ్మీయే. రోడ్డు పనులు చేయించింది మాత్రం మాజీ మంత్రి సునీత సోదరుడు ధర్మవరం మరళి. ఆయనే దగ్గరుండి ఈ పనులను పర్యవేక్షించాడు. అయితే ఎక్కడా నిబంధనలను పాటించకపోయినా సునీత సోదరుడు కావడంతో అధికారులు కూడా మౌనందాల్చాల్సి వచ్చింది.

ఎన్నికల వేళ హడావుడి 
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడటంతో ప్రజలకు గాలం వేసేందుకు రోడ్డు నిర్మాణాన్ని తెరపైకి తీసుకొచ్చారు. గత ఫిబ్రవరి 10న ఈ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏప్రిల్‌ నెలలో రోడ్డుపై కంకర పరిచి, మే నెల 2, 3 తేదీల్లో 2.35 కిలోమీటర్ల రోడ్డును పూర్తి చేసేశారు. కేవలం వారం రోజుల్లోపు చేపట్టిన ఈ రోడ్డు నాణ్యత ఏ స్థాయిలో ఉంటుందో ఇట్టే అర్థమవుతుంది. కోటి రూపాయలకు పైగా వ్యయంతో నిర్మించిన ఈ రోడ్డు నెల రోజులు తిరక్కుండానే నామరూపాలు కోల్పోతోంది. రోడ్డుకు ఇరువైపులా నిర్మించిన బరŠమ్స్‌ విషయంలో సదరు కంపెనీ నిబంధనలకు తిలోదకాలిచ్చింది. ప్రస్తుతం చిన్నపాటి వర్షం కురిసినా రోడ్డుకు ఇరువైపులా మోకాలి లోతు గుంతలు ఏర్పడటంతో పాటు రోడ్డు కోతకు గురవుతోంది. ఎక్కడికక్కడ నెర్రెలు చీలుతున్నాయి. అప్పటికే ఉన్న రోడ్డు మీద తారు పోసిన తీరు చూస్తే పరిటాల కుటుంబం ధన దాహం ఏ స్థాయి ఉందో ఊహించుకోవచ్చు. ఎన్నికల వేళ శ్రీకృష్ణదేవరాయ కన్‌స్ట్రక్షన్స్‌ ఆధ్వర్యంలో చేపట్టిన పనులన్నీ దాదాపు ఇదేవిధంగా ఉన్నట్లు చర్చ జరుగుతోంది.

నిబంధనలు.. ఉల్లంఘనలు 
  ఆర్‌అండ్‌బీ పరిధిలో నిర్మించే 7 మీటర్ల రోడ్లకు అటు ఇటు నిర్మించే మట్టి రోడ్డు పనులు 5 మీటర్ల చొప్పున నిర్మించాలి. 
అదే పంచాయతీరాజ్‌ పరిధిలో నిర్మించే రోడ్లకు ఒక వైపు 1.5 మీటర్లు, మరోవైపు 1.5 మీటర్ల మట్టి రోడ్డు నిర్మించాలి. అయితే ఈ రోడ్డు విషయంలో ఈ నిబంధనలను పట్టించుకున్న దాఖలాల్లేవు. 
 రోడ్డు నిర్మాణానికి ఆయా శాఖలు మట్టి కోసం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తాయి. ఇలా మంజూరు చేసిన వాటికి ఇతర ప్రాంతాల నుంచి మట్టిని తరలించి మట్టి రోడ్డు నిర్మించాలి. ముఖ్యంగా ఎర్రమట్టితోనే మట్టి రోడ్డు వేయాలి. నల్ల రేగడి, లూజ్‌ మట్టి ఉన్న ప్రాంతాల్లో తప్పని సరిగా ఇతర ప్రాంతాల నుంచి ఎర్రమట్టిని తరలించాలి. కానీ ఇక్కడ నిర్మిస్తున్న మట్టి రోడ్డు పక్కనే ఉన్న మట్టిని తవ్వి వినియోగించారు. 
 మట్టి రోడ్డు నిర్మాణంలో భాగంగా లేయర్ల వారీగా రోడ్డు రోలర్‌తో తిప్పించాలి. తోలిన మట్టి గట్టిపడే వరకు నీళ్లు చల్లి రోలింగ్‌ చేయించాలి. కానీ ఇక్కడ ఒకేసారి మట్టి వేసి లెవల్‌ చేసి రోలింగ్‌ చేశారు. 
 మట్టి రోడ్డు గడ్డపారతో తవ్వినా గుంత పడని విధంగా నిర్మించాలి. కానీ చిన్న పాటి వర్షం వస్తే టూవీలర్‌ కూడా ఇరుక్కుపోయే విధంగా ఉన్న నిర్మాణాలు అవినీతికి అద్దం పడుతున్నాయి. 
 గత నాలుగైదు రోజుల కిత్రం కురిసిన వర్షానికి గొల్లపల్లి గ్రామానికి చెందిన ఒక రైతు తన పొలానికి ట్రాక్టర్‌లో వెళ్లాడు. రోడ్డు పక్కనే తోట ఉండటంతో ట్రాక్టర్‌ను రోడ్డుపై నుంచి పొలంలోకి దింపుతుండగా మట్టి రోడ్డులో ఇరుక్కుపోయింది. ట్రాక్టర్‌ను బయటకు తీసేందుకు ఆ రైతుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రమించాల్సి వచ్చింది. 
 రోడ్డు పక్కనే మట్టి రోడ్డును తప్పని సరిగా రోడ్డుకు అటు ఇటు ఏటవాలుగా వర్షం నీరు రోడ్డుపై నిల్వ ఉండకుండా నిర్మాంచాలి. అయితే ఈ నిబంధనను పాటించకపోవడంతో నూతనంగా నిర్మించిన రోడ్డు కూడా నెర్రెలు చీలుతోంది. 
 రోడ్డు నిర్మాణం పూత పూసినట్లుగానే ఉందని, ఇంకాస్త మందంతో వేయాలని అప్పట్లో పెసరకుంట, గొల్లపల్లి గ్రామస్తులు, పొలాల రైతులు అడ్డుపడడంతో వారిని మాజీ మంత్రి సోదరుడు ధర్మవరపు మురళి బెదిరించినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు