నాణ్యమైన బియ్యం రెడీ

24 Aug, 2019 09:11 IST|Sakshi
నాణ్యమైన బియ్యాన్ని పరిశీలిస్తున్న జేసీ శ్రీనివాసులు

జిల్లాకు చేరిన సన్న రకం బియ్యం ప్యాకెట్లు

రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో రాక

జిల్లాకు 13.243 మెట్రిక్‌ టన్నులు అవసరం

సాక్షి, శ్రీకాకుళం పాతబస్టాండ్‌: తెల్ల రేషన్‌ కార్డులపై నాణ్యమైన బియ్యం పంపిణీకి సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీకాకుళం జిల్లాలో శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో అందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం సన్న బియ్యం ప్యాకెట్లు తొలి విడత చేరుకున్నాయి. మరో రెండు రోజుల్లో జిల్లాకు కావాల్సిన సరుకంతా వచ్చే అవకాశముంది. జిల్లాకు 13.243 మెట్రిక్‌ టన్నులు అవసరం ఉండగా, బఫర్‌ స్టాక్‌తో కలిసి 15,000 మెట్రిక్‌ టన్నులు తీసుకువస్తున్నారు. ఈ బియ్యం ప్యాకెట్లను ఈనెల 28 నాటికి అన్ని ఎఫ్‌పి షాపులకు చేరవేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

8,32,636 కార్డుదారులకు ప్రయోజనం..
జిల్లాలో 8,32,636 బీపీఎల్‌ కార్డులు ఉన్నాయి. మొత్తం 26.48 లక్షలమంది లబ్ధిదారులున్నారు. ఈ కార్డుదారులకు నెలకు 13.243 మెట్రిక్‌ టన్నులు బియ్యం అవసరం ఉంటుంది.  ప్రతి వ్యక్తికి (యూనిట్‌కి) అయిదు కేజీలు వంతున అందజేస్తున్నారు. ఈ లెక్కన లబ్ధిదారులకు అయిదు, పది, కేజీలు, 20 కేజీల బ్యాగులను సిద్ధం చేశారు.

 కుటుంబ సభ్యుల ఆధారంగా ప్యాకెట్లు పంపిణీ వివరాలు...
-ఒక సభ్యుడు గల కార్డులు 124049. వీరికి 5 కిలోల ప్యాక్‌
-ఇద్దరు సభ్యులు ఉండే కార్డులు 176505. వీరికి 10 కిలోల ప్యాక్‌
-ముగ్గురు సభ్యులున్న కార్డులు 166530. వీరికి 15 కిలోల ప్యాక్‌
-నలుగురు సభ్యులున్న కార్డులు 248234. వీరికి 20 కిలోల బ్యాగ్‌
-అయిదు సభ్యులున్న కార్డులు 56105. వీరికి  10 కిలోలు, 15 కిలోల ప్యాక్‌లు
-ఆరుగురు సభ్యులున్న కార్డులు 8405. వీరికి 10 కిలోలు, 20 కిలోల ప్యాక్‌లు
-ఏడుగురున్న కార్డులు 1284. వీరికి 15 కిలోలు, 20 కిలోలు బ్యాగులు 
-ఎనిమిది మంది సభ్యులున్న కార్డులు 223. వీరికి 20 కిలోలు గల బ్యాగులు రెండు
-9 మంది సభ్యులు గల కార్డులు 44. వీరికి10 కిలోలు, 15 కిలోలు, 20 కిలోల బ్యాగులు   
-10 మంది ఉన్న కార్డులు 20. వీరికి  పది కేజీల ప్యాక్, 20 కేజీల బ్యాగులు రెండు 
-11 మంది ఉన్న కార్డులు 3. వీరికి 15 కిలోల ప్యాక్‌వై 3, 20 కిలోల బ్యాగ్‌
-ఏఏవై కార్డులు 49,798. వీరికి 15 కిలోలు, 20 కిలోల బ్యాగులు  
-ఏపీ కార్డులు 956. వీరికి 10 కిలోల బ్యాగులు

ఒకటి నుంచి పంపిణీ: జేసీ శ్రీనివాసులు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఇంటివద్దకే నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమం సెప్టెంబర్‌ ఒకటిన జిల్లాలో ప్రారంభం కానుందని జేసీ శ్రీనివాసులు తెలిపారు. నాణ్యమైన బియ్యం తొలి లారీ తూర్పుగోదా వరి నుంచి శ్రీకాకుళం ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కి శుక్రవారం చేరిందని జేసీ తెలిపారు.  ఈ లారీలో 25 మెట్రిక్‌ టన్నుల బియ్యం, వివిధ పరిమాణాల్లో ఉన్నాయి. ఈ లారీతో వచ్చిన బియ్యాన్ని జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ కె శ్రీనివాసులు పరిశీలించారు. కొన్ని ప్యాకెట్లను మచ్చుకి పరిశీలించారు. ముందుగా చెప్పిన విధంగా ఈ ప్యాకెట్లలో నాణ్యమైన బియ్యం రావడంతో ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. వచ్చిన లారీలో చాలా వరకు బియ్యాన్ని శ్రీకాకుళం రూరల్‌ మండలం సింగుపురం ఎఫ్‌పి షాపుల డిపోకు పంపించేందుకు జెండా ఊపి పంపించారు. గ్రామ వాలంటీర్ల ద్వారా ఈ బియ్యాన్ని అందజేస్తామని అన్నారు.

జిల్లాలో ఉన్న 8.32 లక్షల తెలుపు రంగు రేషన్‌ కార్డుదారులు ఉన్నారని, వారికి 13,312 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని 5, 10, 15, 20 కేజీల ప్యాకట్ల రూపంలో సిద్ధం చేశామని ఆయన తెలిపారు. 18 మండల స్థాయి స్టాక్‌ పాయింట్లకు సరఫరా చేస్తామని తెలిపారు. అక్కడ నుంచి ఎఫ్‌పి షాపులకు వెళతాయని తెలిపారు.   శనివారం నాటికి మరో పది లారీల వరకు సుమారుగా 250 మెట్రిక్‌ టన్నుల బియ్యం రానున్నట్టు ఆయన తెలిపారు. సీతంపేట, ఐటిడిఎ గ్రామాలకు సరఫరా చేయనున్నామని తెలిపారు. జిల్లాలో ఈకేవైసీతో సంబంధం లేకుండా సెప్టెంబర్‌ నెల రేషన్‌ ఇవ్వడం జరుగుతుందన్నారు. వచ్చిన బియ్యాన్ని సకాలంలో అన్ని ఎఫ్‌పి షాపులకు అందజేస్తామని జేసీ తెలిపారు. జేసీతోపాటుగా సివిల్‌ సప్లయిస జిల్లా మేనేజర్‌ ఎ.కృష్ణారావు, జిల్లా సరఫరాల అధికారి జి నాగేశ్వరరావు, గోదాం ఇన్‌చార్జీ బి గోపాల్‌ తదితరులు ఉన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా