బీజేపీ నేత విష్ణుకు క్వారంటైన్‌ నోటీసు

24 Apr, 2020 08:40 IST|Sakshi

సాక్షి, కదిరి: లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు రెడ్‌జోన్‌లో ఉన్న కర్నూలుకు వెళ్లి వచ్చిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌.విష్ణువర్ధన్‌రెడ్డిని హోం క్వారంటైన్‌ చేశారు. ఈ మేరకు బుధవారం అధికారులు ఆయన ఇంటికి నోటీసును అతికించారు. నాలుగు వారాల పాటు గృహ నిర్భంధంలో ఉండాలని అధికారులు నోటీసులో పేర్కొన్నారు. కాగా అధికారులు నోటీసులిచ్చేందుకు వెళ్లిన సమయంలో విష్ణువర్ధన్‌రెడ్డి ఇంట్లో ఉండి కూడా తాను లేనని చెప్పడంతో నోటీసు గోడకు అతికించాల్సి వచ్చిందని కదిరి తహసీల్దార్‌ మారుతి తెలిపారు. నోటీసు ధిక్కరించి ఎక్కడికైనా వెళ్లాలని ప్రయత్నిస్తే ఆయనపై కేసు నమోదు చేస్తామని పట్టణ సీఐ రామకృష్ణ తెలిపారు. రెడ్‌జోన్‌ కర్నూలు నుంచి వచ్చినందున ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహించాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. (వెంటాడుతోంది..@30)

నోడల్‌ అధికారికి షోకాజ్‌ నోటీస్‌ 
కరోనా పాజిటివ్‌ కేసుల వివరాలు అనధికారికంగా బయటకు రావడాన్ని కలెక్టర్‌ గంధం చంద్రుడు తీవ్రంగా పరిగణించారు. కోవిడ్‌–19 కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నోడల్‌ అధికారిగా ఉన్న స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ విశ్వేశ్వరనాయుడుకు గురువారం షోకాజ్‌ నోటీస్‌ జారీ చేశారు. జిల్లాలో ఒకే రోజు 8 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయని, మొత్తంగా జిల్లాలో 44 పాజిటివ్‌ కేసులున్నాయని పేర్కొంటూ బుధవారం కలెక్టరేట్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ నుంచి ఓ నోట్‌ అనధికారికంగా బయటకు వచ్చింది. వాస్తవంగా జిల్లాలో ఆరు పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదు కాగా.. కేసుల సంఖ్య 42కు చేరినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాగా అనధికారికంగా వివరాలు బయటికి వెల్లడి కావడం.. అది కూడా తప్పుడు సమాచారం కావడంతో కలెక్టర్‌ తీవ్రంగా పరిగణించారు. దీనిపై సంజాయిషీ కోరుతూ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నోడల్‌ అధికారికి షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. (క్వారంటైన్లో ఉన్నా గైర్హాజరట!)

మరిన్ని వార్తలు