గుండెల్లో పేలుళ్లు

5 Aug, 2018 13:04 IST|Sakshi

జిల్లాలోని క్వారీల్లో బాంబుల మోత

నిబంధనలకు విరుద్ధంగా పేలుళ్లు

బలవుతున్న కార్మికుల జీవితాలు

ధ్వంసమవుతున్న పేదల ఇళ్లు

పట్టించుకోని అధికారులు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: భారీ పేలుళ్లు.. అడ్డగోలుగా యంత్రాలతో తవ్వకాలు.. రేయింబవళ్లు దూసుకెళుతున్న ట్రాక్టర్లు, టిప్పర్లతో క్వారీల ప్రాంతాల్లో ప్రజల గుండెలు అదురుతున్నాయి. అనుమతి నుంచి బ్లాస్టింగ్‌ చేసే వరకు క్వారీల నిర్వాహకులు అడుగడుగునా నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నారు. కూలీల రక్షణను గాలికి వదిలేస్తున్నారు. అధికారులు మామూళ్ల మత్తులో అమాయకుల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. దీంతో అధికార పార్టీ నేతల అండదండలతో మైనింగ్‌ మాఫియా రెచ్చిపోతోంది. తాజాగా అక్రమ మైనింగ్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా అధికారుల్లో మార్పు రాలేదు. అక్రమ మైనింగ్‌కు పాల్పడిన భారీ యంత్రాలను సీజ్‌ చేయడంగానీ, మందు గుండు సామగ్రి సరఫరాపై చర్యలుగానీ తీసుకోలేదు.  

వణుకు పుట్టిస్తున్న బ్లాస్టింగ్స్‌
పిడుగురాళ్ల మండలం కోనంకి, దాచేపల్లి మండలం నడికుడి, కేసానుపల్లి గ్రామాల్లో పేలుడు పదార్థాలతో అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారు. అధికార పార్టీ నేతల పర్యవేక్షణలో ఇవి కొనసాగుతున్నాయి. మైనింగ్‌ లీజు ఉన్న కొంత మందిని అడ్డు పెట్టుకుని.. పేలుడు పదార్థాలను వారి పేరు మీద తీసుకుంటున్నారు. శిక్షణలేని కార్మికులతో 20 అడుగుల లోతులో బ్లాస్టింగ్‌ చేయిస్తున్నారు. నాలుగేళ్లలో సుమారుగా లక్ష మెట్రిక్‌ టన్నుల తెల్లరాయి తవ్వేశారు. దీనికి ఉపయోగించిన పేలుడు పదార్థాలపై పోలీస్, రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు.  

  జిల్లాలో ఇదీ పరిస్థితి
జిల్లాల్లో 295 క్వారీలు, 60 గ్రానైట్, 7 మోజాక్, 17 గ్రావెల్, 102 స్టోన్‌క్రషర్స్‌ ఉన్నాయి. జిల్లా మొత్తంలో ఆరుగురికి మాత్రమే బ్లాస్టింగ్‌ అనుమతి లైసెన్సులు ఉన్నట్టు సమాచారం. అడ్డదారుల్లో జిలెటిన్‌ స్టిక్స్, డిటోనేటర్లు, అమ్మోనియా నైట్రేట్‌లను తీసుకొచ్చి పేలుళ్లకు పాల్పడుతున్నారు.  

  ఇన్సూరెన్స్‌ ఊసే లేదు 
కార్మికులకు మైన్స్‌ సేఫ్టీ నిబంధనల ప్రకారం గ్రూపు ఇన్సూరెన్స్‌ తప్పనిసరి. అది ఎక్కడా అమలు కావడం లేదు. గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ ఉంటే ప్రమాదాలు జరిగినప్పుడు బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందుతుంది. ప్రీమియం ఎక్కువగా ఉందని చాలామంది కార్మికులకు లీజుదారులు బీమా చేయడం లేదు. 

అమ్మోనియా వాడకానికి ప్రాధాన్యం
డిటోనేటర్‌లో లెడ్‌ ఆక్సైడ్‌ అనే పేలుడు పదార్థం ఉంటుంది. దాన్ని కేవలం చేతితో రాపిడి చేస్తే పేలుతుంది. జిలెటిన్‌ స్టిక్స్‌  వైర్లు కలిపి పేల్చాలి. ఈ ప్రక్రియ కొంచెం ఆలస్యంతోపాటు శ్రమతో కూడు కున్నది. ఈ నేపథ్యంలో అమ్మోనియం నైట్రేట్‌ పొడిని రంధ్రాల్లో  కూర్చి పేలుళ్లకు పాల్పడుతున్నారు. ఎక్కువ మంది క్వారీ యజమానులు ఈ పద్ధతికి అలవాటు పడా ్డరు. పిడుగురాళ్లకు చెందిన ఇసాక్‌ అనే వ్యా పారి తెలంగాణాలోని నల్లగొండ వైపుగా అ డ్డదారుల్లో అమ్మోనియాను జిల్లాకు తరలిం చి వ్యానులో యథేచ్ఛగా విక్రయిస్తున్నాడు.   

ప్రాణాలు పోతున్నా పాఠాలు నేర్వరా ?
ఫిరంగిపురం మండలం గొల్లపాలెం క్వారీలో గత ఏడాది మే 27న బ్లాస్టింగ్‌ కోసం ప్రయత్నిస్తుండగా జరిగిన ప్రమాదంలో ఏడుగురు కూలీలు మృతి చెందారు. ఈ సమయంలో ఉపయోగించిన పేలుడు పదార్థాలకు అనుమతులు లేవు. అప్పటి నుంచి మందు గుండు సామగ్రి రవాణా, నిల్వలపై ఆరా తీసిన వారు లేరు.  

మరిన్ని వార్తలు