క్వారీ.. జీవితాలకు గోరీ

8 Aug, 2019 09:45 IST|Sakshi
అక్రమంగా వెలసిన క్వారీలో జరుగుతున్న పనులు

గ్రామాల సమీపంలో క్వారీల ఏర్పాటు 

నిబంధనలకు విరుద్ధంగా భారీ పేలుళ్లు 

ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం 

దుమ్ము,ధూళితో రోగాల బారిన జనం 

టీడీపీ హయాంలో ఆ పార్టీ నేతలు ఇష్టానుసారం వ్యవహరించారు. సహజ వనరులను కన్నేసిన కొందరు నిబంధనలకు తూట్లు పొడిచి రూ.కోట్లు వెనకేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా గ్రామాల సమీపంలోనే క్వారీ ఏర్పాటు చేసి నిరుపేదల జీవితాలతో ఆడుకుంటున్నారు. రాత్రిళ్లు భారీ పేలుళ్లు సాగిస్తుండటంతో గ్రామీణులకు కంటిమీద కునుకు కరువైంది. క్వారీల నుంచి వచ్చే దుమ్ము, ధూళితో ఇప్పటికే ఎందరో రోగాలబారిన పడ్డారు. క్వారీలను మూయించాలని నెత్తీనోరు కొట్టుకుంటున్నా... అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదు. 

సాక్షి, అగళి: మండలంలోని హెచ్‌డీ హళ్లి, పీ బ్యాడగెర గ్రామ పొలిమేరల్లో ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సోదరుడు చంద్రప్ప, రొద్దం మండలానికి చెందిన టీడీపీ నాయకుడు జీవీపీ నాయుడు, టీడీపీ మాజీ సర్పంచు క్రిష్ణప్ప, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నదీంలు ఐదు క్వారీలు ఏర్పాటు చేశారు. వాస్తవానికి గ్రామానికి సమీపంలో క్వారీలు ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధం. అయినప్పటికీ అప్పటి టీడీపీ సర్కార్‌ అండతో అధికారులకు మామూళ్లు ముట్టజెప్పి వీరంతా క్వారీలు ఏర్పాటు చేసి గ్రానైట్‌ దందా నడిపిస్తున్నారు.

కూలీల పొట్టగొట్టి.... 
హెచ్‌డీ హళ్లి, పీ బ్యాడగెర గ్రామాలకు చెందిన నిరుపేద కూలీలు కొందరు పాతికేళ్ల క్రితం మైలార లింగేశ్వరస్వామి లేబర్‌ కోఆపరేటివ్‌ సొసైటీ ఏర్పాటు చేసుకుని సర్వే నంబర్‌ 288–2, 282–3, 301–1, 301–2 ,302–2లలోని 25 ఎకరాల్లోని కొండల్లో రాళ్లు కొట్టుకుని జీవనం సాగించేవారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెనుకొండకు చెందిన ఓ టీడీపీ నాయకుడి సహకారంతో ఈ కొండల్లో క్వారీ నిర్వహించేందుకు జీవీపీ నాయుడు అనే వ్యక్తి అనుమతులు తెచ్చుకున్నాడు. దీంతో ఉపాధి కోల్పోయిన కూలీలు ఆందోళనకు దిగారు. తమ బతుకులతో ఆడుకోవద్దని, క్వారీకి అనుమతులివ్వొద్దని వేడుకున్నారు. అయినప్పటికీ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా క్వారీ ఏర్పాటు చేసుకోవచ్చంటూ టీడీపీ నేతకు అనుమతులిచ్చేశారు. ఆ తర్వాత మరో నలుగురు ఇక్కడే క్వారీలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతులు పొంది గ్రానైట్‌ దందా సాగిస్తున్నారు. 

రాయల్టీ సొమ్ము స్వాహా.. 
క్వారీల నిర్వాహకులు నిత్యం వందల లారీల్లో గ్రానైట్‌ను యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. పేరుకు ఒకటి, రెండు ట్రిప్పులకు రాయల్టీ చెల్లించి ....రోజూ పదుల లారీల్లో గ్రానైట్‌ను కర్ణాటక, తమిళనాడుకు రవాణా చేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి రూ.కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఈ క్రమంలోనే ఆగస్టు 1న రాత్రి విజిలెన్స్‌ అధికారులు ఈ క్వారీల నుంచి బిల్లులు లేకుండా గ్రానైట్‌ను రవాణా చేస్తున్న ఐదు లారీలను సీజ్‌ చేసి రూ.10 లక్షలు దాకా జరిమానా విధించారు.

ఇళ్లకు బీటలు.. జనానికి రోగాలు 
క్వారీల సమీపంలోనే వడ్రహట్టి గ్రామం, ఆ పక్కనే  గుడ్డద రంగనాథస్వామి దేవాలయం ఉంది. నిబంధనల ప్రకారం గ్రామాల సమీపంలో క్వారీల ఏర్పాటుకు అనుమతి ఇవ్వకూడదు. అయినప్పటికీ అప్పటి రెవెన్యూ అధికారులు అమ్యామ్యాలకు ఆశపడి అనుమతులిచ్చేశారు. దీంతో క్వారీలు ఏర్పాటు చేసుకున్న వారు రాత్రివేళల్లో భారీస్థాయిలో పేలుళ్లు జరుపుతున్నారు. దీంతో గ్రామంలోని ప్రజలకు కంటిమీద కునుకు కరువైంది. శబ్ధ, వాయు కాలుష్యంతో పిల్లలు, హృద్రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పేలుళ్ల ధాటికి గ్రామంలోని ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. అదే విధంగా దేవాలయానికి బీటలు ఏర్పడి శిథిలావస్థకు చేరుకుంది. దీంతో కొందరు గ్రామీణులు దేవాలయానికి రక్షణ కల్పించాలని గతంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. క్వారీల నుంచి వచ్చే దుమ్ము, ధూళితో ఇప్పటికే పలువురు రోగాల బారిన పడ్డారని, పర్యావరణానికి తీవ్ర విఘాతం ఏర్పడుతోందని మొరపెట్టుకున్నారు. అయినా అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. 

నిద్ర కరువైంది 
మా గ్రామ సమీపంలోనే క్వారీ ఉంది. రాత్రి వేళల్లో భారీ స్థాయిలో పేలుళ్లు జరుగుతున్నాయి. ఇంట్లో ఉండాలంటే భయమేస్తోంది...నిద్ర కరువైంది. ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. క్వారీ నుంచి వచ్చే దుమ్ము, ధూళితో చాలా మంది రోగాల బారిన పడ్డారు. ఇక్కడ క్వారీకి అనుమతి ఇవ్వొద్దని అధికారులను వేడుకున్నా...వారు పట్టించుకోలేదు. ఇప్పటికైనా ఈ క్వారీని నిలివేయిచాలి. లేదంటే మేమంతా ఊరు వదిలి పోవాలి. 
– హనుమక్క, వడ్రహట్టి, అగళి మండలం 

తనిఖీలు చేస్తాం 
వారం రోజుల క్రితమే నేను బాధ్యతలు తీసుకున్నాను. క్వారీ అనుమతుల విషయం నాకు తెలియదు. గతంలో ఉన్న  తహసీల్దార్లు క్వారీల అనుమతికి నివేదిక ఇచ్చారు. దాని మేరకు జిల్లా మైనింగ్‌ అధికారులు అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. త్వరలోనే క్వారీలను తనిఖీ చేస్తాం. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు తేలితే ఉన్నతాధికారులకు నివేదిక పంపుతాం. ఆ తర్వాత చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.  
– రమేశన్, తహసీల్దార్, అగళి  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా