అసైన్డ్‌ భూమిలో అక్రమ క్వారీయింగ్‌

14 Dec, 2018 13:41 IST|Sakshi
వీరనాయకునిపాలెం గ్రామంలో అక్రమ క్వారీయింగ్‌ చేస్తున్న దృశ్యం

అసైన్డ్‌ భూమిలో అక్రమ క్వారీయింగ్‌

గుంటూరు, చేబ్రోలు(పొన్నూరు): అధికార పార్టీ నాయకులు అసైన్డ్‌ భూముల్లో అక్రమ క్వారీయింగ్‌ చేస్తూ ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా గ్రావెల్‌ మాఫియా అడ్డూఅదుపు లేకుండా అక్రమాలకు పాల్పడుతోంది. అవినీతి అక్రమాలను అడ్డుకోవలసిన మైనింగ్, రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు. కొద్ది రోజుల క్రితం చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామంలో అర్ధరాత్రి సమయంలో అక్రమ క్వారీయింగ్‌ చేస్తున్న వారిని గుర్తించి గ్రామస్తులు అడ్డుకొని రెవెన్యూ, పోలీసు శాఖలకు సమాచారం ఇచ్చినప్పటికీ వారిపై ఎటువంటి చర్య తీసుకోకపోవటానికి అధికార పార్టీ నాయకుల అండదండలే కారణమని విమర్శలు ఉన్నాయి. మూడు పొక్లెయినర్లు, 17లారీలు, రెండు హెవీ లోడ్‌ లారీలను పోలీసులకు స్వాధీనం చేసినప్పటికీ వారిపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

సుద్దపల్లి గ్రామంలో సొంత స్థలాన్ని చదును చేసుకుంటున్న వారిపై రెవెన్యూ అధికారులు పొక్లెయినర్, రెండు ట్రాక్టర్లను స్వాదీనం చేసుకుని కేసులు నమోదు చేయడంతో పాటు, రెండు నెలల పాటు పోలీసు స్టేషన్‌లో వాహనాలు ఉంచారు. అదే రెవెన్యూ, పోలీసు శాఖలు నేడు అక్రమ క్వారీయింగ్‌ చేస్తున్న వారిపై నామమాత్రంగా నైనా చర్యలు తీసుకోకపోవటంపై పలు ఆరోపణలు వస్తున్నాయి. చేబ్రోలు మండలం వీరనాయకునిపాలెం గ్రామంలోని  అర ఎకరం స్థలంలో రైల్వే లైన్‌ పనులకు గ్రావెల్‌ అవసరాల కోసం అని అనుమతులు తీసుకొని విక్రయాలు చేస్తున్నారు. స్థలం పక్కనే ఉన్న అసైన్డ్‌ భూమిలో కూడా అధికార పార్టీ నాయకులు యంత్రాల సహాయంతో తవ్వి ట్రాక్టర్లు, లారీలతో గ్రావెల్‌ను తరలిస్తున్నారు. లక్షల విలువైన ప్రభుత్వ భూముల్లో క్వారీయింగ్‌ జరుపుతుండటంతో అవి పెద్ద పెద్ద అగాధాలను తలపిస్తున్నాయి. వేజండ్ల, వడ్లమూడి, సుద్దపల్లి, శేకూరు, చేబ్రోలు గ్రామాల్లో అక్రమ క్వారీయింగ్‌ జరుగుతోంది. ప్రభుత్వ భూములనే టార్గెట్‌ చేసుకొని అధికార పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడుతూ నాయకులు జేబులు నింపుకొంటున్నారు.

పరిశీలించి చర్యలు తీసుకుంటాం
ప్రభుత్వ భూములు, జిల్లా పరిషత్‌ భూములు, చెరువులను టార్గెట్‌ చేసుకొని అక్రమార్కులు తవ్వకాలు జరుపుకొని గ్రావెల్‌ను విక్రయించుకుంటున్నారు. వీరనాయకునిపాలెం గ్రామంలో జరుగుతున్న అక్రమ క్వారీయింగ్‌పై తహసీల్దారు జి.సిద్దార్థను ‘సాక్షి’ వివరణ కోరగా అర ఎకరంలో క్వారీయింగ్‌కు అనుమతులు ఇచ్చినట్టు తెలిపారు. పక్కనే ఉన్న అసైన్డు భూమిలో తవ్వకాలు జరుగుతున్నట్టు తమ దృష్టికి రాలేదన్నారు. పరిశీలించి ప్రభుత్వ స్థలంలో క్వారీయింగ్‌ జరుగుతున్నట్లు నిర్ధారణ అయితే మైనింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.–తహసీల్దార్‌ జి.సిద్దార్థ

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా