సత్వర తీర్పుతోనే నమ్మకం

15 Dec, 2013 04:32 IST|Sakshi

పీలేరు, న్యూస్‌లైన్: కేసుల సత్వర తీర్పుతోనే ప్రజలకు న్యాయస్థానాలపై నమ్మకం ఏర్పడుతుందని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టుపోలియో జడ్జి జస్టిస్ కే.చంద్రభాను అన్నారు. శనివారం పీలేరులో జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ఆయన ప్రారంభించారు. 22 సంవత్సరాలుగా చిత్తూరు జిల్లాతో తనకు అవినాభావ సంబంధం ఉందన్నారు. ఎప్పుడు జిల్లాకు వచ్చినా సొంత ఊరికి వచ్చినంత ఆనందంగా ఉంటుందన్నారు.

తీర్పులు త్వరితగతిన, సత్వరం పరిష్కరించేలా న్యాయవాదులు కృషిచేయాలన్నారు. ఓ పంచాయతీ కేం ద్రంలో ఐదు కోర్టులు ఉన్న దాఖలా లు పీలేరులో మినహా రాష్ట్రంలో మరెక్కడా లేవన్నారు. పీలేరు బార్ అసోసియేషన్ పనితీరు బాగుందని కితాబిచ్చారు. స్థానికంగా కోర్టు భవనాల నిర్మాణం కోసం 2.47 ఎకరాల స్థలాన్ని ఇచ్చారని, ఇందుకోసం మార్కెట్ విలువ ప్రకారం రూ.1.6 కోట్లు గతంలోనే చెల్లించామని గుర్తుచేశారు. ఇప్పుడు మరో రూ.కోటి చెల్లిస్తే స్థలాన్ని పూర్తి స్థాయిలో అప్పగిస్తామని రెవెన్యూ మెలిక పెట్టినట్లు వాపోయారు.

ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని స్థానిక న్యాయవాదులకు సూచించారు. తక్కువ మంది న్యాయమూర్తులు ఉన్నందున అన్ని కోర్టులలో జడ్జీల నియామకం చేపట్టలేకపోయామన్నారు. అంతకుముందు జస్టిస్ కేసీ.భానుకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. సమావేశం అనంతరం ఆయన్ను స్థానిక బార్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి రవిబాబు, మూడో అదనపు జిల్లా జడ్జి రవీంద్రబాబు, 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి రాజమౌళిశర్మ, పీలేరు సీనియర్, జూనియర్ సివిల్ జడ్జీలు వీ.కృష్ణమూర్తి, వెంకట కవిత, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.ఎం.డీ.రఫీఅన్సారీ, మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు.
 
జిల్లాకు 5 కొత్త కోర్టులు

మదనపల్లెక్రైం : చిత్తూరు జిల్లాకు ఐదు కొత్త కోర్టులు మంజూరైనట్టు హైకోర్టు న్యాయమూర్తి కే.చంద్రభాను తెలిపారు. శనివారం మదనపల్లె రెండో అదనపు జిల్లా కోర్టు ఆవ రణలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల కోర్టులపై సమీక్ష నిర్వహించినప్పుడు మదనపల్లెలో 3 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. బార్ అసోసియేషన్ సభ్యుల సూచన మేరకు అదనపు కోర్టును మంజూరు చేయిం చామని ఆయన వెల్లడించారు.

తిరుపతిలోని తిరుచానూరు రోడ్డులో 10 ఎకరాల విస్తీర్ణంలో కోర్టుల సముదాయాన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. మదనపల్లె బార్ అసోసియేషన్ నూతన కార్యాలయ నిర్మాణానికి 16 లక్షల రూపాయలు మంజూరు చేసినట్టు గుర్తుచేశారు. జిల్లాలో ప్రస్తుతం 54 కోర్టులు ఉన్నాయని, శనివారం పీలేరులో ఒక కోర్టు, మదనపల్లెలో మరో కోర్టు ప్రారంభించడంతో ఈ సంఖ్య 56కు పెరిగిందని చెప్పారు. ఈ సమావేశంలో  న్యాయమూర్తులు వెంకట్రమణ, ఎస్‌ఎస్‌ఎస్ జయరాజ్‌లు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు