ఓట్ల కోసం బీసీలను వాడుకుంటున్న పార్టీలు..

26 Apr, 2018 20:29 IST|Sakshi
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్‌ కృష్ణయ్య (ఫైల్‌ ఫోటో)

బీసీలకు అన్యాయం చేస్తున్న సీఎం

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సమావేశంలో ఆర్‌ కృష్ణయ్య

సాక్షి, అమరావతి: బీసీ న్యాయవాదులను న్యాయమూర్తులు కాకుండా ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడు అడ్డుకుంటున్నారని, ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఏముంటుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్‌ కృష్ణయ్య అన్నారు. ఈ ప్రభుత్వానికి బీసీలు మద్దతు ఇచ్చారని, ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందన్నారు. గురువారం విజయవాడలోని ఐలాపురం హోటల్‌లో జరిగిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీసీలంటే ఉన్నత ఉద్యోగాల్లో ఉండకూడదనే కుట్ర సీఎం మనసులో ఉండటం ఏమిటని ప్రశ్నించారు. బీసీలకు అన్యాయం చేస్తే ఒప్పుకునేది లేదని, బీసీ కార్యకర్తలందరూ పార్టీ పెట్టాలని కోరుతున్నారన్నారు. బీసీ న్యామవాదులు తీవ్ర స్థాయిలో సీఎం లేఖను వ్యతిరేకిస్తున్నారని, బీసీ సంఘాలు కూడా అదే స్థాయిలో వ్యతికేకిస్తున్నట్లు చెప్పారు.

ఆరుగ్గురు బీసీ న్యాయవాదులు న్యాయమూర్తులు కాకుండా అడ్డుకోవడం అంటే బీసీలకు అన్యాయం చేయడమేనన్నారు. కొలీజియం తీసుకున్న నిర్ణయం తొందరపాటు చర్యగా సీఎం చెప్పడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబు ఏకంగా హైకోర్టునే తప్పుపట్టారంటే ఏ విధమైన ఆలోచనా విధానంతో ఉన్నారో అర్థమవుతుందన్నారు. దేశంలో ఓట్ల కోసం బీసీలను రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయని, జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ బద్ధమైన హక్కు కల్పించాలని కోరుతున్నా కేంద్రం స్పందించడం లేదన్నారు. ఎన్నో పోరాటాల ద్వారా బీసీల హక్కులు సాధించుకున్నట్లు చెప్పారు. బీసీల హక్కులు, సమస్యల పరిష్కారానికి పార్టీలు ఆసక్తి చూపడం లేదన్నారు.

చట్ట సభల్లో నామినేటెడ్‌ పదవులకు 50 శాతం కేటాయించాలని డిమాండ్‌ చేశారు. బీసీలకు రాజ్యాంగాధికారం లక్ష్యంగా కొత్త పార్టీ ఏర్పాటుకు తగిన సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏపీలో బీసీలకు చంద్రబాబు నాయుడు పూర్తిగా అన్యాయం చేశారన్నారు. ఇప్పుడు మాలో రాజకీయ చైతన్యం వచ్చినందున రాజ్యాధికారం కోసం పోరాటాలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. బీసీ సంఘాలతో చర్చించి త్వరలోనే రాజకీయ పార్టీ విధి విధానాలు రూపొందిస్తామన్నారు. గ్రామ స్థాయి నుంచి సంఘాన్ని పటిష్ట పరిచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు