సీఎం వైఎస్‌ జగన్‌తో ఆర్‌.కృష్ణయ్య భేటీ

15 Jul, 2019 19:42 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: దేశంలో ఏ నాయకుడు చేయని విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టించారని బీసీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య అన్నారు. దేశంలో బీసీల పార్టీలుగా చెప్పుకునే వాళ్లంతా బీసీలను మోసం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్‌.కృష్ణయ్య సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్లపై చర్చ జరిపారు. ఈ భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ఒక్కరే చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని బిల్లు పెట్టారు. కేంద్రం ఆ బిల్లును పెండింగ్‌లో పెట్టినా బీసీ బిల్లు కోసం పోరాడతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. 

చదవండి: బీసీ బిల్లుకు కేంద్రం నో

బడ్జెట్‌లో కూడా బీసీలకు అత్యధికంగా రూ.15వేల కోట్ల నిధులు కేటాయించారు. అమ్మ ఒడి, విద్యార్థులకు రూ.20వేల మెస్‌ ఛార్జీలు, ప్రతి బీసీ కులానికి ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి బీసీలను అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎలాగైతే ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ పథకాలతో బీసీల జీవితాల్లో వెలుగులు నింపారు. అలాగే వైఎస్‌ జగన్‌ ప్రతి పథకంలోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే అత్యధికంగా లబ్ది చేకూరేలా చేశారు. మంత్రివర్గంలో 60శాతం పదవులే కాకుండా డిప్యూటీ సీఎం పదవి కూడా ఇచ్చారు. బలహీన వర్గాలకు రాజకీయ గుర్తింపు ఇచ్చారు. బీసీల కోసం నేను ఒకటి అడిగితే రెండు చేస్తున్నారు. సీఎం జగన్‌ వల్ల నాకు పోరాటం చేయడానికి సబ్జెక్టే లేకుండా పోయింది’ అని అన్నారు. కాగా చట్టసభల్లో ఓబీసీల జనాభా నిష్పత్తికి అణుగుణంగా రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ బిల్లు ప్రతిపాదిస్తూ రాజ్యసభలో విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టిన ‘ప్రైవేట్‌’బిల్లుపై జూన్‌ 21న సభలో సుదీర్ఘ చర్చ జరిగిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు