పేదోళ్ల ‘ఇంగ్లిష్‌’ చదువుకు అడ్డు చెప్పొద్దు

8 Feb, 2020 04:18 IST|Sakshi

సినీ దర్శక, నిర్మాత, నటుడు ఆర్‌.నారాయణమూర్తి

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ధనిక వర్గాలవారే కాకుండా బడుగు, బలహీనవర్గాల వారి పిల్లలు కూడా ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకుని ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఆశయంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారని, అందుకు కోర్టులు, నాయకులు అడ్డు చెప్పవద్దని సినీ దర్శక నిర్మాత, నటుడు ఆర్‌.నారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు. ‘పేద ప్రజలకు ఆంగ్ల విద్య’ అంశంపై శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ ఎస్సీసెల్‌ జిల్లా అధ్యక్షుడు పొన్నాడ రుషి అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో నారాయణమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలు 90 శాతం ఉన్నారని, వారంతా ఆంగ్ల మాధ్యమ విద్య లేక ఉద్యోగావకాశాలు పొందలేక కూలీలుగా, వలసజీవులుగా మిగిలిపోతున్నారని చెప్పారు.

దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం పెట్టి నిరుపేదలకు విద్యనందిస్తే, ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో అడుగు ముందుకేసి 1వ తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమంలో విద్యనందించి అక్షరాస్యత పెంచేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. తెలుగు మీడియంలో మంచి మార్కులు సాధించినా.. ఇంగ్లిష్‌ మీడియంలో చదివిన వారికే ఉద్యోగాలు ఎక్కువగా లభిస్తున్నాయని చెప్పారు.

ఇంగ్లిష్‌ మీడియం వద్దన్న చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు తమ  కార్పొరేట్‌ స్కూళ్లు, కాలేజీలు మూసివేయగలరా? వాళ్ల పిల్లల్ని తెలుగు మీడియంలో చదివించగలరా అని సవాలు విసిరారు. రాష్ట్రానికి చెందిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్రంలో దీనికి అడ్డులేకుండా సహకరించాలని కోరారు. పేదోడి చదువుకి అడ్డు తగలవద్దని విజ్ఞప్తి చేశారు. బహుళ రాజధానులకు అడ్డు తగలకుండా రాష్ట్ర అభివృద్దికి సహకరించాలని ఆయన కోరారు. 

మరిన్ని వార్తలు