మూగవేదన

9 Feb, 2015 08:59 IST|Sakshi
మూగవేదన

పర్యాటక కేంద్రం చిత్తూరు జిల్లా హార్సిలీహిల్స్‌లోని జంతు ప్రదర్శన శాలలో కుందేళ్లు మూగగా రోదిస్తున్నాయి. వాటిని సంరక్షించాల్సిన అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఈ దుస్థితి దాపురించింది. వ్యాధి బారినపడిన ఒక మూగజీవికి సరైన చికిత్సలు అందించలేదు. ఫలితంగా దాదాపు 40 కుందేళ్లకు వ్యాధి వ్యాపించింది. మూడు నెలలుగా ఇవి చర్మ వ్యాధితో బాధపడుతున్నాయి.
 
బి.కొత్తకోట:చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీ హిల్స్‌లో పర్యావరణ సముదాయాన్ని అటవీశాఖ పర్యవేక్షిస్తోంది. ఇందులో వన్యప్రాణులు, జంతువులు, పక్షులతో కూడిన జంతుప్రదర్శనశాల కొనసాగుతోంది. వీటి సంరక్షణ బాధ్యత అటవీశాఖదే. ఇందులోనే 40 నుంచి 50 కుందేళ్లు ఉన్నాయి. తొలుత ఓ కుందేలుకు మూతిపై పుండ్లు ఏర్పడ్డాయి. ఈ వ్యాధి ఒకదానికొకటిగా వ్యాపిస్తూ మిగిలిన వాటికీ సోకింది. విషయాన్ని గుర్తించిన అటవీ సిబ్బంది బి.కొత్తకోట పశువైద్యాధికారి వెంకటరెడ్డిని సంప్రదించారు. ఇది చర్మవ్యాధిగా ఆయన నిర్ధారించారు. కొన్ని మందులు, సూదులు సూచించారు.

చికిత్సలకు అవసరమైన సౌకర్యాలు లేకపోవడంతో మదనపల్లె ఏడీ రమేష్ ను సంప్రదించాలని కోరారు. దీనిపై అటవీ సిబ్బంది ఓ కుందేలును తీసుకుని ఏడీ వద్దకు వెళ్లారు. పరిశీలించిన ఏడీ ఐవర్ మెక్‌టీన్ అనే సూదిమందు పుండ్లున్న చోట పూసేందుకు ఆయింట్‌మెంట్లను సూచించారు. ఇది జరిగి నెల కావస్తోంది. అప్పటి నుంచి ఆయింట్‌మెంట్ ఇస్తున్న అటవీ సిబ్బంది సూదిమందు వేయించలేదు. దీంతో కుందేళ్లకు వ్యాధి విస్తరిస్తూ పోతోంది. వ్యాధి తగ్గుముఖం పట్టేలా కనిపించడం లేదు. ప్రస్తుతం కుందేళ్ల ము ఖంపై పుండ్లతో ఇబ్బందులు పడుతున్నాయి. దీనిపై పశువైద్యాధికారి వెంకటరెడ్డి మాట్లాడుతూ చిన్నిచిన్న పురుగుల కారణంగా వ్యాధి వస్తుందని చెప్పారు.

హార్సిలీహిల్స్‌లోని కుందేళ్లకు చికిత్సను చెప్పామని అన్నారు. మదనపల్లె ఏడీ రమేష్ మాట్లాడుతూ తన వద్దకు ఓ కుందేలును తెచ్చి చూపించారని, దానికి సూదిమందు చెప్పానని వేయించారో లేదో తెలియదని చెప్పారు. అటవీశాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ డాక్టర్లు సూచించిన ఆయింట్‌మెంట్ రాస్తున్నామని చెప్పారు. సూది మందు వేసేందుకు అన్నింటినీ మదనపల్లెకు తీసుకుపోలేని పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. పశువైద్యసిబ్బంది రావడంలో జాప్యం జరుగుతోందని, దీనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు