రబీ పంటలకు ‘లోటు’ తెగులు!

13 Feb, 2015 06:21 IST|Sakshi
  • అదనులో కురవని వర్షాలు.. పాతాళంలో భూగర్భ జలాలు
  • సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో రబీ పంటల సాగు విస్తీర్ణం ఆందోళన కలిగిస్తోంది. రబీ పంటలు సాగయ్యే 25.89 లక్షల హెక్టార్లకుగానూ ఇప్పటివరకు 21 లక్షల హెక్టార్లలో పంటలు వేసినట్టు వ్యవసాయ శాఖ చెబుతున్నా వాస్తవ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఇప్పటికే 24.12 లక్షల హెక్టార్లలో పంటలు వేయాలి. ప్రైవేటు సంస్థల సమాచారం ప్రకారం ఫిబ్రవరి తొలివారం నాటికి 18 లక్షల హెక్టార్లలోనే పంటలు సాగులోకి వచ్చాయి.

    వాతావరణం అనుకూలించక భూగర్భ జలాలు అడుగంటడం, రిజర్వాయర్ల నుంచి నీరు విడుదలయ్యే పరిస్థితి లేకపోవడంతో రైతులు అదునులో పంటలు వేయలేకపోయారు. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో పంటలు వాడిపోతున్నాయి. పత్తి, పొద్దు తిరుగుడు, కంది, రాగి, మొక్కజొన్న, నూగు పంటల పరిస్థితి ఆశాజనకంగా లేదు. ప్రస్తుతం చాలా చోట్ల మిర్చి పంట కల్లాల్లో ఉంది.

    ఖరీఫ్ సీజన్‌లో వేసిన పత్తి తీతలు ఊపందుకున్నాయి. చెరకు కొట్టుడు కూడా దాదాపు పూర్తి కావొచ్చింది. మొక్కజొన్న, నువ్వులు పూత, పిందె దశలో ఉన్నాయి. వరి ఊడ్పులు పూర్తయ్యాయి. రెండో పంటకు నీళ్లు ఇస్తారన్న ఆశతో కోస్తా జిల్లాల్లో వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. నాగార్జున సాగర్ జలాశయంలో నీళ్లు అడుగంటడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

మరిన్ని వార్తలు