కాటేస్తే కాటికేనా..!

25 Apr, 2019 13:27 IST|Sakshi
విచ్చలవిడిగా తిరుగుతున్న గ్రామ సింహాలు

జిల్లాలో నిండుకున్న యాంటీ రేబీస్‌ వ్యాక్సిన్‌ 

ప్రాణాపాయ స్థితిలో కుక్కకాటు బాధితులు

రోజు,రోజుకూ పెరుగుతున్న బాధితులు 

సొమ్ము చేసుకుంటున్న ప్రైవేటు ఆసుపత్రులు

కుక్కల సంతతి నివారణా చర్యలు శూన్యం

ఇంజక్షన్ల సరఫరా లేదుయాంటీ రేబీస్‌ ఇంజక్షన్లసరఫరా ఈ నెల ఒకటో తేదీ నుంచి నిలిచిపోయింది. స్టాకు రావడం లేదు. ప్రస్తుతం కొన్ని ఆస్పత్రుల్లో మాత్రమే వినియోగిస్తున్నాం. స్టాకు రావాల్సి ఉంది.
కాకినాడ  సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టోర్స్‌(సీడీఎస్‌) సిబ్బంది,  

తూర్పుగోదావరి, పిఠాపురం: గ్రామ సింహాలు గర్జిస్తున్నాయి. తమను చంపే దమ్ము ఎవరికీ లేదనుకుంటున్నాయో ఏమో దొరికిన వారందరిపైనా దాడులు చేస్తున్నాయి. ఫలితంగా అనేక మంది కుక్కకాటుకు గురై ప్రాణ భయంతో వైద్యం కోసం ఎదురుచూస్తున్నారు. కానీ జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో కుక్కకాటు వ్యాక్సిన్‌ నిండుకోవడంతో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోను యాంటీ రేబిస్‌ ఇంజక్షన్లు సరఫరా నిలిచిపోయింది. గత మార్చి  నెల వరకు ఇంజక్షన్లు ఉన్నప్పటికీ మార్చి నెలాఖరు నుంచి సరఫరా నిలిచిపోవడంతో జిల్లాలో ఏ ఒక్క పీహెచ్‌సీలోను ఈ ఇంజక్షన్లు లేక ప్రతి రోజు వేల మంది బాధితులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో ప్రతిరోజూ వందకుపైగా కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయి. పీహెచ్‌సీలలో యాంటీరాబిస్‌ ఇంజక్షన్ల కొరత బాధితులను కలవరపెడుతోంది.

నిలిచిపోయిన యాంటీ రేబిస్‌ ఇంజక్షన్ల సరఫరా...
జిల్లాలో అన్ని ప్రభుత్వాసుపత్రులకు యాంటీ రేబిస్‌ ఇంజక్షన్ల సరఫరా కాకినాడలోని సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టోర్స్‌ (సీడీఎస్‌) నుంచి సరఫరా అవుతుంది. అయితే ఈ నెల ఒకటో తేదీ నుంచి సరఫరా నిలిచిపోవడంతో ఎక్కడా యాంటీ రేబీస్‌ ఇంజక్షన్లు లేకుండా పోయాయి. ప్రతి నెలా ఇక్కడి నుంచి జిల్లాలో అన్ని ప్రభుత్వాసుపత్రులకు సుమారు 50 వేల డోసులు సరఫరా చేస్తుంటారు. ఒక్కో బాధితుడికి ఐదుసార్లు ఇంజక్షన్లు చేయాల్సి ఉంది. ఒక్కో ఇంజక్షన్‌ బయట మార్కెట్‌లో రూ . 350 వరకూ విక్రయిస్తున్నారు. అంటే ఐదుసార్లు చేయించుకుంటే రూ.1750లు వెచ్చించాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రులలో ఇంజక్షన్లు లేక ఒకసారి చేసి లేదనిపించేస్తున్నారు.

గర్భ నిరోధక చర్యలు శూన్యం...
శునకాలకు గర్భ నిరోధక చర్యలు తీసుకోకపోవడంతో ప్రతి గ్రామంలోనూ వీటి సంఖ్య పెరిగిపోతోంది. కొన్ని గ్రామాల్లో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నా నివారించే చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. కుక్కలను సంహరించ కూడదన్న నిబంధనలు ఉండడంతో సుమారు మూడు సంవత్సరాల నుంచి కుక్కల నివారణకు చర్యలు తీసుకోవడం లేదు.దీంతో జిల్లాలో లక్షకు పైగా కుక్కలు పెరిగిపోయి విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నాయి. గడిచిన ఏడాదిగా పిఠాపురం నియోజకవర్గంలోనే సుమారు 150 వరకు గేదె దూడలు కుక్కకాటు వల్ల చనిపోయినట్లు రైతులు చెబుతున్నారు. ఒక్క గొల్లప్రోలు మండలం ఏకేమల్లవరంలో 20 గేదె దూడలపై దాడి చేసి చంపేసినట్టు స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో వందల సంఖ్యలో పెరిగిపోయిన కుక్కలు వీధుల్లో స్త్వైరవిహారం చేస్తూ చిన్నలు, పెద్దలనే తేడాలేకుండా దాడులు చేస్తుండడంతో భయాందోళనలకు గురవుతున్నామని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఒక్క పిఠాపురం మున్సిపాలిటీలోనే సుమారు 2 వేల కుక్కలున్నాయంటే కుక్కలు ఎంతగా పెరిగిపోతున్నాయో అర్ధమవుతుంది.

ఆపరేషన్లు చేస్తే దాడులు ఆగుతాయా..?
ఆపరేషన్లు చేస్తే కుక్కల సంతతి వృద్ధి చెందకుండా ఉంటుంది తప్ప దాడులు ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయాలంటే ముందుగా వాటిని బంధించడానికి బోనులు ఏర్పాటు చేయాలి. ఒక్కో బోనులో ఐదు కుక్కలను మాత్రమే తీసుకెళ్లేందుకు ఆపరేషన్‌ చేసేందుకు వీలుంటుంది. వాటికి ఆపరేషన్‌ పూర్తయ్యాక సుమారు ఐదు రోజులు నిత్యం గమనిస్తుండాలి అవసరమైతే వైద్య సేవలందించాలి. అప్పటి వరకు ఆ కుక్కలను బోనులోనే ఉంచాలి. ఈ విధంగా అయితే గ్రామాల్లో ఉన్న వందల కుక్కలకు ఆపరేషన్లు పూర్తి కావాలంటే కొన్ని నెలలు పడుతుంది. ఇంతలో సుమారు 100 కుక్కలు సంతానోత్పత్తి చేసినా ఒక్కో కుక్క నాలుగు పిల్లలను పెట్టినా మరో నాలుగు వందల కుక్కలు పెరుగుతాయి.

మరిన్ని వార్తలు