‘రచ్చ’న పడేశారు!

21 Nov, 2013 01:15 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కర్నూలు :  కల్లూరు మండల పరిధిలోని 21, 22, 23 వార్డులకు సంబంధించి నగరంలోని మాధవనగర్‌లో రచ్చబండ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణమూర్తి తదితరులు హాజరయ్యారు. విషయం తెలిసి స్థానికులురేషన్‌కార్డులు, వృద్ధాప్య, వికలాంగ, వితంతు పింఛన్లు, పక్కా ఇళ్లు, ఇంటి స్థలాలు, బంగారుతల్లి పథకం కోసం  పెద్ద ఎత్తున వినతి పత్రాలు సమర్పించారు. పనులన్నీ వదులుకుని క్యూలో నిల్చొని ఎమ్మెల్యే, అధికారులకు అర్జీలు అందించారు.

వీటన్నింటినీ ఓ మూట కట్టి.. ఆ తర్వాత అక్కడే ఓ మూలన పడేసి ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. ఈ మూటను గుర్తించిన స్థానికులు పత్రికల కార్యాలయాలకు సమాచారం చేరవేశారు. ఆ తర్వాత మూటను విప్పి చూడగా రచ్చబండ దరఖాస్తులు బయటపడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. తమ వినతులకు ఇచ్చే విలువ ఇదేనా అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా జిల్లాలో ఇప్పటి వరకు 46 చోట్ల రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించినా.. వినతుల స్వీకరణలో అధికారులు అయిష్టత చూపుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటున్న ఈ కార్యక్రమాలకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు. సమస్యలపై నోరు విప్పడమే తరువాయి.. పోలీసులు వారిని అక్కడి నుంచి తరిమేస్తున్నారు. ఫలితంగా కార్యక్రమాలు నామమాత్రం అవుతున్నాయి. విషయం తెలిసి చాలా మంది ప్రజలు దూరంగానే ఉండిపోతున్నారు.

మొదటి, రెండు విడతలను పరిశీలిస్తే ఈ విడతలో దరఖాస్తులు తగ్గేందుకు నాయకులు, అధికారుల తీరే కారణంగా తెలుస్తోంది. గ్రామాల్లో కాకుండా మండల కేంద్రాలకే రచ్చబండను పరిమితం చేయడంతో గ్రామీణులు తమ సమస్యలను చెప్పుకునేందుకు వచ్చి నిరాశతో వెనుదిరుగుతున్నారు. నాయకులు సైతం మొక్కుబడిగానే కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. మొత్తంగా ఈ కార్యక్రమం రాజకీయ పార్టీ సమావేశాన్ని తలపిస్తుండటం గమనార్హం.

 

మరిన్ని వార్తలు