సీఎం సాక్షిగా కాంగ్రెస్ సభలా.. రచ్చబండ

26 Nov, 2013 02:34 IST|Sakshi

 అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా ప్రజల సొమ్ముతో కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగత ప్రచార పర్వాన్ని భుజానెత్తుకుంది. ప్రభుత్వ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించకుండా నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు ఏర్పాటుచేసిన రచ్చబండను సొంత బహిరంగసభలా చేపట్టారు. సోమవారం రాయచోటిలో రచ్చబండ కార్యక్రమాన్ని ఇన్‌చార్జి మంత్రి మహీధర్‌రెడ్డి నేతృత్వంలో కొనసాగించారు.  కాంగ్రెస్ నేతలు మాకం అశోక్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే శివానందరెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, పీసీసీ మెంబర్ రాంప్రసాద్‌రెడ్డి, కాంగ్రెస్ నేత హరిప్రసాద్, మాజీ ఎంపీ గునిపాటి రామయ్య, మాజీ ఎమ్మెల్యేలు నారాయణరెడ్డి, వరదరాజులరెడ్డి, సీఎం సోదరుడు కిశోర్‌కుమార్‌రెడ్డి తదితరులతోపాటు కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు ఎర్రగుడి చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ప్రభాకర్‌రెడ్డి లాంటి వారితో సభా వేదిక నిండుకుంది. కలెక్టర్‌లాంటి జిల్లా అత్యున్నత అధికారిని సైతం రెండవ వరుసకు పరిమితం చేశారు.
 
 కాంగ్రెస్ మార్క్ పెత్తనం :
 జిల్లా అధికారులపై ఇన్‌చార్జి మంత్రి మహీధర్‌రెడ్డి కాంగ్రెస్ మార్క్ పెత్తనాన్ని ప్రదర్శించారు. ముఖ్యమంత్రి హెలిప్యాడ్ వద్ద జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్, డీఐజీ మురళీకృష్ణ బందోబస్తు పర్యవేక్షణ చేస్తున్నారు. ఇంతలో మంత్రి మహీధర్‌రెడ్డి వాహనం దూసుకురాగా పోలీసు అధికారులు అడ్డుచెప్పారు. తన వాహనాన్నే అడ్డుకుంటారా నేనెవరో తెలియదా? అంటూ ఇన్‌చార్జి మంత్రి మహీధర్‌రెడ్డి ఆగ్రహోదగ్ధులయ్యారు. జిల్లా ఎస్పీపై వార్నింగ్ తరహాలో పదజాలాన్ని ఉపయోగించారు. అంతలో అక్కడికి చేరుకున్న కలెక్టర్ శశిధర్‌తో నేనెవరో తెలియని స్థితిలో పోలీసులు ఉన్నారా అని ధ్వజమెత్తారు.   
 

>
మరిన్ని వార్తలు