పోరు ఆగదు

19 Dec, 2018 12:07 IST|Sakshi
ధర్నాలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి

ప్రొద్దుటూరుకు ఇసుక క్వారీ ఇవ్వాల్సిందే

జమ్మలమడుగుకే రెండు క్వారీలు

ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి

వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా

ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఇసుక క్వారీ మంజూరు చేసే వరకూ పోరును కొనసాగిస్తామని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి స్పష్టం చేశారు. ఇసుక క్వారీ మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక వన్‌టౌన్‌ సర్కిల్‌ నుంచి గాంధీ రోడ్డు, శ్రీరాములపేట నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఇసుక క్వారీ మంజూరు కాలేదని తెలిపారు. ఈ కారణంగా ట్రాక్టర్‌ ఇసుకను రూ.2,500 వరకు వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. పేద, మధ్యతరగతి, ధనవంతులను ఇసుక పేరుతో లూటీ చేస్తున్నారన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించి మంత్రి ఆదినారాయణరెడ్డి స్వగ్రామమైన దేవగుడితోపాటు సున్నపురాళ్లపల్లె, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ స్వగ్రామమైన పోట్లదుర్తికి ఇసుక క్వారీలను మంజూరు చేశారన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలో గత నాలున్నరేళ్లలో పలు క్వారీలు మంజూరు చేశారన్నారు.

పట్టణ ప్రాంతమైన ప్రొద్దుటూరులో ఇసుకకు పూర్తి డిమాండ్‌ ఉందని, అయితే అధికారులు ఇక్కడ మాత్రం ఇసుక క్వారీ మంజూరు చేయలేదన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు సర్వే చేసినా క్వారీల మంజూరుకు వెనుకంజ వేస్తున్నారని విమర్శించారు. ఈ సమస్య తీవ్రతను తాను స్వయంగా కలెక్టర్‌ మొదలు కింది స్థాయిలో ఉన్న తహసీల్దార్‌ వరకు పలుమార్లు విన్నవించినా వారు పెడచెవిన పెడుతున్నారన్నారు. ఈ ప్రభావం జనంతోపాటు అభివృద్ధి పనులపై కూడా పడుతోందన్నారు. మంత్రి, రాజ్యసభసభ్యుడు పెన్నానదిని తమ సొంతమని ఆక్రమించుకుని ఇతరులను రానివ్వడం లేదన్నారు. ఎవరైనా బయటి నుంచి ట్రాక్టర్లను తీసుకొని వెళితే దౌర్జన్యం చేస్తున్నారని, దీనిని పోలీసులతో సహా ఏ అధికారులు అరికట్టలేకపోతున్నారని తెలిపారు. ఇసుకపై తాను చేస్తున్న ఆర్తనాదాన్ని అధికారులకు చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లు ఉందన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కావడంతోనే అధికారులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్నారు.

దశల వారీగా ఆందోళన
ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఇసుక క్వారీ మంజూరు చేసే వరకు దశల వారీగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ఐదారు రోజుల్లో అన్ని వర్గాల ప్రజలతో కలసి ప్రొద్దుటూరు బంద్‌కు పిలుపునిస్తామన్నారు. అప్పటికీ అధికారుల్లో చలనం రాకపోతే తాను 48 గంటల పాటు నిరాహార దీక్ష చేపడుతానని హెచ్చరించారు. ఆ తర్వాత కూడా సమస్యను పరిష్కరించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 43 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలలను ఆహ్వానించి శాంతియుతంగా ఆందోళన చేపడుతామని తెలిపారు. ఇన్ని రకాల ఆందోళనలను చేసినా స్పందించకుంటే సమస్య పరిష్కారం కోసం తాను ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడుతానని స్పష్టం చేశారు. అనంతరం తహసీల్దార్‌ కిరణ్‌జ్ఞానమూర్తికి వినతిపత్రం సమర్పించారు. వైఎస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, స్టేట్‌ అడిషనల్‌ సెక్రటరీ లక్కిరెడ్డి పవన్‌రెడ్డి, నియోజకవర్గ యూత్‌ ఇన్‌చార్జి సానపురెడ్డి ప్రతాప్‌రెడ్డి, మహిళా విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు గజ్జల కళావతి, జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరు నాగేంద్రారెడ్డి, జెడ్పీ కోప్షన్‌ మెంబర్‌ అక్బర్, మండల కన్వీనర్‌ దేవీప్రసాదరెడ్డి, చేనేత కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు బీఎన్‌ఆర్, జిల్లా అధికార ప్రతినిధి ఓబయ్య, జిల్లా సహాయ కార్యదర్శి షాపీర్‌ఆలీ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు