ముస్లింలను వంచించిన టీడీపీని నమ్మొద్దు

10 Oct, 2018 15:09 IST|Sakshi
ముస్లింలతో కలిసి పట్టణంలో తిరుగుతున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ

ఎమ్మెల్యే  రాచమల్లు శివప్రసాదరెడ్డి

వైఎస్‌ఆర్‌ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం : ముస్లింలను వంచించిన టీడీపీని నమ్మొద్దని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. ప్రొద్దుటూరులో ఆయన మంగళవారం ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర బడ్టెట్‌లో టీడీపీ ప్రభుత్వం ముస్లింల అభివృద్ధికి ఎలాంటి నిధులు కేటాయించలేదని ఆరోపించారు. ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పి చంద్రబాబు ముస్లింలకు తీరని అన్యాయం చేశారన్నారు. ముస్లిం కుటుంబాల్లోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను ఇస్తామని, చేతి వృత్తులు చేసుకునే ముస్లిం మహిళలకు రూ.లక్ష, మదరసాలో చదివే చిన్న పిల్లలకు దుస్తులు కుట్టిస్తానని, బస్‌పాస్‌లు ఇస్తామని చెప్పి వారిని వంచించారని విమర్శించారు. అలాగే ఎమ్మెల్యే టికెట్లు, ఎమ్మెల్సీలు, చట్ట సభల్లో అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పి రాజకీయంగా ముస్లింలకు ఎక్కడా అవకాశం కల్పించలేదన్నారు. దేశ చరిత్రలోనే ముస్లిం మంత్రి లేకుండా ఉన్న ఏకైక క్యాబినెట్‌ చంద్రబాబుదే అని ఆయన పేర్కొన్నారు.

టీడీపీకి ముస్లిం ఓట్లు 10 శాతం కూడా రావు
రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు రాష్ట్రంలో 10 శాతం ముస్లింల ఓట్లు కూడా రావని ఎమ్మెల్యే తెలిపారు. ముస్లింల పట్ల అత్యంత గౌరవం, ప్రేమాభిమానాలను పంచిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని అధికారంలోకి తీసుకొని రావడానికి ముస్లిం కుటుంబాలు ఎదురు చూస్తున్నాయన్నారు. ముస్లింల అభివృద్ధికి వైఎస్‌ 4 శాతం రిజర్వేషన్లు కల్పించారనే కారణంతో ఆయన కుటుంబాన్ని ప్రేమిస్తున్నారంటే వారు ఎంత నమ్మకస్తులో అర్థం అవుతోందని తెలిపారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ముస్లింలు నివాసం ఉన్న ప్రాంతాలకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. టీడీపీ సాధించలేని ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థను వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే తీసుకొస్తుందని ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, రాజుపాళెం పార్టీ మండల కన్వీనర్‌ ఎస్‌ఏ నారాయణరెడ్డి, చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బలిమిడి చిన్నరాజు, జిల్లా అధ్యక్షుడు నాగరాజు, నాయకులు పోరెడ్డి నరసింహారెడ్డి, శివచంద్రారెడ్డి, పోతిరెడ్డి మురళీనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు