లాక్‌డౌన్‌ వల్లే విద్యుత్‌ చార్జీలపై అపోహలు

23 May, 2020 11:22 IST|Sakshi
విద్యుత్‌ వినియోగదారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి

ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి

ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు పట్టణంలో విధించిన లాక్‌డౌన్‌ వల్లే విద్యుత్‌ బిల్లులు పెరిగాయి తప్ప ప్రభుత్వం ధరలను పెంచలేదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. ట్రాన్స్‌కో ఎస్‌ఈ శ్రీనివాసులు, డీఈ శ్రీనివాసులరెడ్డి, ఏఏఓ బాలసుబ్రహ్మణ్యంతో కలసి విద్యుత్‌చార్జీలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ పలు మార్లు అధికారులతో చర్చించిన అనంతరం అనుమానాలను నివృతి చేసుకుని ఈ విషయాలను చెబుతున్నట్లు తెలిపారు. ప్రొద్దుటూరులో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదు కావడంతో విద్యుత్‌సిబ్బంది బిల్లులు వసూలు చేయడానికి వీలు లేకుండా పోయిందన్నారు.దాదాపు 70 రోజుల పాటు బిల్లులు వసూలు చేయలేదని చెప్పారు. ప్రస్తుతం ఏప్రిల్, మే నెలతోపాటు జూన్‌ నెలకు సంబంధించి 15 రోజుల బిల్లును కూడా కలుపుతున్నారన్నారు. దీనికి సంబంధించి స్లాబ్‌లు మార్చలేదన్నారు. కేవలం రోజువారీ విద్యుత్‌ ఖర్చును లెక్కించి బిల్లు వేశారన్నారు.

ప్రొద్దుటూరు నియోజకర్గంలో లక్షా 5వేల విద్యుత్‌ మీటర్లు ఉండగా కేవలం ప్రొద్దుటూరు పట్టణంలో మాత్రమే ఈ సమస్య ఏర్పడిందన్నారు. మండలంతోపాటు రాజుపాళెం మండలంలో కరోనా ప్రభావం లేకపోవడంతో యధావిధిగా వసూలు చేశారన్నారు. అక్కడ బిల్లు పెరగలేదన్నారు. టీడీపీ నేతలు చేసిన విమర్శలపై తాను వివరణ ఇవ్వలేదని, కేవలం ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పరిపాలన సాగిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి బిల్లులు పెంచి ఖజానా నింపుకోవాల్సిన అవసరం లేదన్నారు. 500 యూనిట్లుపైగా విద్యుత్‌ ఖర్చు చేసేవారికి మాత్రమే యూనిట్‌కు 90పైసలు చొప్పున చార్జీలు పెంచారన్నారు.

పెరిగిన విద్యుత్‌ బిల్లులకు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఏమాత్రం సంబంధం లేదని అన్నారు. ప్రజలు తమకు పథకాలు వర్తించబోమని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్‌ చార్జీలు ఓ మారు పెంచి ఏడాదికంతటికీ అదే విధానాన్ని అమలు చేసేవారన్నారు. ప్రస్తుతం విద్యుత్‌ ఖర్చు ఆధారంగా వచ్చే కేటగిరిని బట్టి ప్రతి నెలా వసూలు చేస్తారన్నారు. చంద్రబాబు తన హయాంలో రూ.2.5లక్షల కోట్లు అప్పు పెట్టగా సీఎం జగన్‌ ఆ బకాయిలను పూడ్చి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు.టీటీడీ పాలకమండలి సభ్యుడు చిప్పగిరి ప్రసాద్, వైఎస్సార్‌సీపీ కడప పార్లమెంటరీ అధ్యక్షురాలు జింకా విజయలక్ష్మి, మాజీ కౌన్సిలర్‌ వరికూటి ఓబుళరెడ్డి, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ కామిశెట్టిబాబు పాల్గొన్నారు. అనంతరం విద్యుత్‌ రెవెన్యూ కార్యాలయాన్ని పరిశీలించారు.  నూతన భవనం నిర్మించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ విషయంపై ప్రతిపాదనలు తయారు చేసి పంపితే తాను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ద్వారా నిధులు మంజూరు చేయిస్తానన్నారు. 

మరిన్ని వార్తలు