వీళ్లా..పాలకులు!

22 Nov, 2013 03:10 IST|Sakshi

 నెల్లూరు(హరనాథపురం), న్యూస్‌లైన్ : అధికారులు, అధికార పార్టీ పాలకుల మదాందానికి ఈ రచ్చబండ సాక్షి. రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏకంగా తరగతి గదిని ఆక్రమించి విద్యార్థులను ఆరు బయటకు తరిమేశారు. విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారన్న ఇంగితం లేకుండా వ్యవహరించారు. లౌడ్ స్పీకర్లు పెట్టి తమ ప్రసంగాలతో విద్యార్థుల ఏకాగ్రతను దెబ్బతీశారు. ప్రభుత్వ పాఠశాల కావడంతో ఆ విద్యార్థులు ఎటుపోతే మాకేంటి అన్న రీతిలో వ్యవహరించారు. నగరంలోని ఏసీ నగర్‌లోని మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో నగర, రూరల్ ఎమ్మెల్యేల నేతృత్వంలో రచ్చబండ నిర్వహించారు. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు విద్యార్థులు త్రైమాసిక పరీక్షలు రాస్తున్నారు. ఈ రచ్చబండ నిర్వహణకు ఓ గది వరండాను వేదికగా వాడుకున్నారు. దీంతో ఆ గదిలో పరీక్షలు రాయాల్సి విద్యార్థులు ఆరు బయట మరో గది వరండాలో పరీక్షలు రాశారు.
 
 అదే సమయంలో మైక్‌ల ద్వారా పాలకులు తమ ప్రసంగాలను హోరెత్తించారు. దీంతో విద్యార్థులు ఏకాగ్రత కొరవడి పరీక్షలు సక్రమంగా రాయలేకపోయారు. పాలకులే నిబంధనలను ఉల్లంఘిస్తున్నా.. వారిని వారించలేక ఉపాధ్యాయులు మౌనం వహించారు. రచ్చబండకు హాజరైన జిల్లా అధికారులు పరీక్షలు జరిగే సమయంలో పాఠశాలలో రచ్చబండ నిర్వహించొద్దని సూచించకపోవడం, పాలకుల సేవలో తరించడం బాధాకరం. పాలకుల తీరు చూసి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వీళ్లా..మన పాలకులంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
 

మరిన్ని వార్తలు