‘ఉపాధి’లో ప్రక్షాళన

1 Aug, 2015 03:05 IST|Sakshi
‘ఉపాధి’లో ప్రక్షాళన

- ప్రతి ఆవాసంలోనూ తప్పని సరిగా పనులు
- పని కావాలన్నా.. వద్దన్నా డిమాండ్ లెటర్ ఇవ్వాల్సిందే
- బిల్లుల చెల్లింపుల్లోనూ సమూల మార్పులు
- పంచాయతీ కార్యాలయాల నోటీసులో బిల్లుల జాబితా
అనంతపురం సెంట్రల్ :
మహాత్మగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకంలో సమూల మార్పులు చేసేందుకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. గ్రామాల్లో ఉపాధి లేక వలస పోతున్నామనే మాట ప్రజల నుంచి వినిపించకూడదు అనే లక్ష్యంతో డ్వామా అధికారులు మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. వివరాల్లోకి వెలితే... జిల్లాలో ఉపాధిహామీ పథకం అమలు కాని ప్రాంతాల్లో ఎక్కువశాతం మంది పట్టణాలకు, ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారనే అభిప్రాయం సర్వత్రావ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆ అపవాదును దూరం చేయడానికి అధికారులు ప్రక్షాళనతంత్రం చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ఆవాసప్రాంతాల్లో పనుల కల్పనకు డిమాండ్ లెటర్‌ను కూలీల నుంచి సేకరిస్తున్నారు.

అలాగే పనులు వద్దు అన్నా కూడా నో డిమాండ్ లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. దీని వలన ఉపాధి పనులు లేకనే వలస పోతున్నారనే మాట రాదనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అలాగే కూలీలు పని కావాలని డిమాండ్ లెటర్ ఇచ్చినా పని కల్పించకపోతే 24 గంటల్లో సంబందిత ఫీల్డ్ అసిస్టెంట్‌లను విధుల నుంచి తొలగించాలని కఠినతరమైన ఉత్తర్వులు అమలు చేస్తున్నారు. బిల్లుల చెల్లింపుల విషయంలోనూ సమూల మార్పులు తీసుకొస్తున్నారు. పోస్టల్‌శాఖ ద్వారా చేపడుతున్న బిల్లుల చెల్లింపు విషయంలో అవకతవకలు జరిగితే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. గతంలో ఫీల్డ్ అసిస్టెంట్‌ల ద్వారా కూలీల వేతనాలకు సంబందించి స్లిప్పులు జారీ చేసేవారు. ఇక నుంచి శ్రమశక్తిసంఘాల ద్వారా ఇవ్వనున్నారు. స్లిప్‌లపై తప్పనిసరిగా మండల ఏపీఓ సంతకం, సీల్ వేయాలనే నిబందన విధించారు.

దీని వలన బినామీ పేర్లతో బిల్లుల చెల్లింపులకు అడ్డుకట్ట పడనుంది. కూలీలు డబ్బులు తీసుకున్న తర్వాత తప్పనిసరిగా స్లిప్‌లను జాబ్‌కార్డు, నోట్‌బుక్‌లో అతికించుకోవాలి. అలాగే ప్రతి వారం బిల్లులు తీసుకున్న కూలీల జాబితా తప్పనిసరిగా గ్రామ పంచాయతీ కార్యాలయ నోటీసుబోర్డులో అతికించాలనే నిబందన కూలీలకు ఉపయుక్తంగా మారనుంది. ఎవరెవరు బిల్లులు తీసుకుంటున్నారు.. నకిలీల పేర్లు ఉన్నాయా ? అని అంశాలపై ప్రజలు సైతం తెలుసుకునే వెసులుబాటు కల్పించారు.
 
జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ పనులు కల్పించడమే లక్ష్యం :
ఉపాధిజాబ్‌కార్డు పొందిన ప్రతి ఒక్కరికీ పనులు కల్పించడమే లక్ష్యంగా ఉన్నాం. పనిలేక వలస పోతున్నామనే మాట కూలీల నుంచి రాకూడదు. పని అడిగిన 24 గంటల్లో పని కల్పించలేకపోతే సంబందిత ఫీల్డ్ అసిస్టెంట్‌ను నిర్దాక్షిణంగా తొలగిస్తాం. కావున ప్రతి అవాసప్రాంతం నుంచి డిమాండ్, నో డిమాండ్ లెటర్‌లను కూలీల నుంచి సేకరిస్తున్నాం. ఈ ఏడాది నెలకొన్న తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు వలస పోకూడదనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాం.
నాగభూషణం,ప్రాజెక్టు డైరక్టర్, డ్వామా

మరిన్ని వార్తలు