రఘునందన్కాంగ్రెస్ గూటికి

21 Aug, 2013 00:19 IST|Sakshi
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: టీఆర్‌ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఎం.రఘునందన్‌రావు మంగళవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో చేరారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ పార్టీ కండువా కప్పి రఘునందన్‌ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. సీఎం కిరణ్‌కు అత్యంత సన్నిహితుడు, ఎమ్మెల్సీ మాఘం రంగారెడ్డి మధ్యవర్తిత్వంతో రఘునందన్‌రావు కాంగ్రెస్‌లో చేరినట్టు సమాచారం.
 
 జిల్లాకు చెందిన మరో ఇద్దరు టీఆర్‌ఎస్ నేతలు కూడా త్వరలో కాంగ్రెస్‌లో చేరతారని రఘునందన్‌రావు తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఎవరా ఇద్దరు నేతలు అనే విషయం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్‌లో చేరిన తరువాత రఘునందన్‌రావు ఢిల్లీ నుంచి ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచన మేరకు పార్టీ జెండాలు పక్కన పెట్టి ఉద్యమించి తెలంగాణ సాధించుకున్నట్టు తెలిపారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ చేతులను బలోపేతం చేయాలని కేసీఆర్ గతంలోనే అన్నారని ఆయన గుర్తుచేశారు. అందులో భాగంగానే తాను కాంగ్రెస్‌లో చేరినట్టు వెల్లడించారు. 
 
 విజయశాంతి చేరికపై నిరసన గళం..
 టీఆర్‌ఎస్ బహిష్కృత ఎంపీ విజయశాంతి కాంగ్రెస్‌లో చేరికపై ఆ పార్టీలో నిరసన గళం వినిపిస్తోంది. విజయశాంతి పార్టీలో చేరితే వచ్చే ఎన్నికల్లో తమ గెలుపు అవకాశాలు దెబ్బతింటాయని జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే అంశంపై జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ కీలక నేతలు మంగళవారం ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎంపీపై తీవ్ర వ్యతిరేకత నెలకొందని, అది పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బ తీస్తుందని దిగ్విజయ్‌కు ఫిర్యాదు చేసేం దుకు నేతలు సిద్ధమవుతున్నారు. 
 
 ఒకటి,రెండు రోజుల్లో ఇదే అంశంపై దిగ్విజయ్‌తో ప్రత్యేకంగా భేటీ అవుతామని కాంగ్రెస్ కీలక నేత ఒకరు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో చేరికపై సోమవారం దిగ్విజయ్ సింగ్‌తో భేటీ అయిన విజయశాంతి మంగళవారం ఆంటోనీ కమిటీ సభ్యుడు వీరప్ప మొయిలీని కూడా కలిశారు. రాష్ట్ర విభజన ద్వారా సీమాంధ్రుల్లో నెలకొన్న అపోహలు, భయాలు, వాటిని తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మొయిలీకి విజయశాంతి నివేదిక సమర్పించినట్టు విశ్వసనీయ సమాచారం. 
 
మరిన్ని వార్తలు