చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది

30 Mar, 2019 14:43 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న రఘురామ్‌

సాక్షి, తుని: ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే కుల, మతాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఏపీ బీజేపీ జాతీయ సమన్వయకర్త పురిగళ్ల రఘురామ్‌ అన్నారు. తుని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే మైనార్టీలు, క్రిస్టియన్లకు భద్రత ఉండదని చంద్రబాబు ప్రచారం చేస్తు, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించని అధికారులపై ఫిర్యాదులు వస్తే ఎన్నిక కమిషన్‌ చర్యలు తీసుకోవడం సహజమన్నారు.

ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఆదేశిస్తే, ఎన్నికల కమిషన్‌ను విమర్శించడంతో పాటు కోర్టుకు వెళ్లడం ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడం కాదా అని ప్రశ్నించారు. గతంలో చాలా మంది అధికారులపై ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకున్న సంఘటనలు ఉన్నాయన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత యధావిధిగా పోస్టులో కొనసాగుతారన్న విషయాన్ని చంద్రబాబు మరిచిపోయారన్నారు. జనసేన పార్టీ వెనుక టీడీపీ పాత్ర ఉందని, అన్ని పార్టీలతోనూ పొత్తులు పెట్టుకుని బీజేపీని విమర్శించడం సమంజసం కాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చే తీర్పునకు ఎవరైనా కట్టుబడి ఉండాలన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎంఎల్‌జి శ్రీనివాస్, తుని నాయకులు ఎంబీ కృష్ణమూర్తి, ఆకెళ్ల శాస్త్రి, కుమార్‌ పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు