ప్రతి గ్రామంలో 150 మొక్కలు నాటిస్తాం

29 Sep, 2019 12:34 IST|Sakshi
మాట్లాడుతున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు 

సాక్షి, భీమవరం: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థలో భాగంగా అక్టోబర్‌ 2న నరసాపురం మండలం పెదమైనవానిలంక గ్రామంలో  సచివాలయ నూతన భవనాన్ని ప్రారంభిస్తున్నట్టు ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజు చెప్పారు. శనివారం భీమవరంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. అదేరోజు హరితభారత్‌ కార్యక్రమంలో భాగంగా నరసాపురం పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నట్లు రఘురామకృష్ణంరాజు చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని  మహత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా తాను నియోజకవర్గం పరిధిలోని ప్రతి గ్రామంలో 150 మొక్కలు చొప్పున నాటించనున్నట్లు తెలిపారు.

విద్యాసంస్థల్లో కూడా మొక్కలు నాటించే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు చేతుల మీదుగా ప్రత్యేకంగా ప్రశంసాపత్రాలు అందిస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ పాలనలో మొక్కలు పెంపకం పేరుతో కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారని రఘురామకృష్ణంరాజు విమర్శించారు. ప్రస్తుతం నిధులు దుర్వినియోగానికి అవకాశం లేకుండా మొక్కలను మాత్రమే ప్రభుత్వం సరఫరా చేస్తుందని వాటి సంరక్షణను ప్రజలు స్వచ్ఛందంగా చేపట్టాలన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు దృష్ట్యా కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. దీనిలో భాగంగానే  మొక్కల పెంపకంలో పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తయారుచేయడానికి అన్నివర్గాల ప్రజలు సహకరించాలని ఎంపీ కోరారు. అనంతరం వివిధ మండలాల అధికారులతో మొక్కలు నాటే కార్యక్రమానికి సంబంధించి సమీక్షించారు. విలేకరుల సమావేశంలో పాలకొల్లు నియోజకవర్గ వైఎస్సార్‌ ఇన్‌చార్జ్‌ కవురు శ్రీనివాస్, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు గాదిరాజు లచ్చిరాజు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు